ఆర్సీబీకి గ‌ట్టి షాక్‌.. మాక్స్‌వెల్ అనూహ్య నిర్ణ‌యం.!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జ‌ట్టులోని ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ IPL 2024 సీజన్ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు

By Medi Samrat  Published on  16 April 2024 10:53 AM IST
ఆర్సీబీకి గ‌ట్టి షాక్‌.. మాక్స్‌వెల్ అనూహ్య నిర్ణ‌యం.!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జ‌ట్టులోని ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ IPL 2024 సీజన్ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఘోర పరాజయం తర్వాత మీడియాతో మాట్లాడిన మ్యాక్స్‌వెల్ ఈ విషయాన్ని వెల్లడించాడు. మాక్స్‌వెల్ తన పేలవమైన ఫామ్ కారణంగా ఈ సీజన్‌లో చాలా విమర్శలను ఎదుర్కొన్నాడు. నిన్న సన్‌రైజర్స్‌తో జరిగిన ప్లేయింగ్‌-11లో కూడా చోటు ద‌క్క‌లేదు. ప్లేయింగ్-11లో అతని స్థానంలో విల్ జాక్వెస్ వచ్చాడు. మరొకరిని ప్రయత్నించమని కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌ను స్వయంగా కోరినట్లు మ్యాచ్ తర్వాత మ్యాక్స్‌వెల్ వివరించాడు.

మీడియా సమావేశంలో మాక్స్వెల్ మాట్లాడుతూ.. ప్రస్తుతం త‌న మానసిక, శారీరక స్థితి బాగా లేదని చెప్పాడు. అందుకే విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్ల‌డించాడు. అయితే ఈ లీగ్‌లో ఎంతకాలం ఆడడో.. తదుపరి సీజన్‌లో కూడా అతడుఆడుతాడో లేదో చెప్పలేదు. ఇది నాకు వ్యక్తిగతంగా చాలా సులభమైన నిర్ణయం. నేను చివరి మ్యాచ్ తర్వాత ఫాఫ్ డు ప్లెసిస్, కోచ్ వద్దకు వెళ్లి, బహుశా మనం వేరొకరిని ప్రయత్నించే సమయం వచ్చిందని నేను భావిస్తున్నాను. నేను ఇంతకుముందు కూడా ఈ పరిస్థితిలో ఉన్నాను. మీకు కావాలంటే నేను ఆడుతూనే ఉండవచ్చు.. కానీ అది మిమ్మల్ని మరింత చీకటిలోకి నెట్టవచ్చు. ఇప్పుడు నాకు మానసికంగా, శారీరకంగా విశ్రాంతి తీసుకోవడానికి, నా శరీరాన్ని సరిదిద్దుకోవడానికి ఇదే మంచి సమయం అని నేను భావిస్తున్నాను. నేను ఆడవలసి వస్తే.. దృఢమైన మానసిక, శారీరక స్థితిలో తిరిగి వచ్చి ప్రభావం చూపడానికి ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు.

Next Story