యూఏఈ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే టీమ్ఇండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని విరాట్ కోహ్లీ చెప్పాడు. పనిభారం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని.. అయితే టెస్టుల్లో, వన్డేల్లో కెప్టెన్‌గా కొనసాగుతానని తెలిపిన సంగతి తెలిసిందే. ఇక కోహ్లీ కెప్టెన్‌గా తప్పుకోవడంతో తదుపరి కెప్టెన్ ఎవరు అవుతారు అన్నదానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. వైస్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మకు ప్రమోషన్ లభించవచ్చునని పలువురు అంచనా వేస్తున్నారు.
అయితే.. ప్రస్తుతం రోహిత్ శర్మ వయస్సు 34 ఏళ్లు కావడంతో టీమ్ఇండియా భవిష్యత్తు దృష్ట్యా యువకులను ఎంపిక చేసుకుంటేనే మంచిదని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఈ విషయంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఓ అడుగు ముందుకు వేసి ఓ ఆటగాడి పేరును సూచించారు. రోహిత్‌ను కెప్టెన్‌గా చేయాలని బీసీసీఐ చూస్తుంది కాబట్టి.. టీమ్ వైస్ కెప్టెన్‌గా రాహుల్‌ను నియమించాలని సూచించాడు. ఓ కొత్త కెప్టెన్‌ను బీసీసీఐ తయారు చేయాలనుకుంటే రాహుల్‌పై దృష్టి పెడితే మంచిది. ఇంగ్లాండ్‌లో అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఐపీఎల్, వన్డేల్లో కూడా మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పుడు రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమిస్తే.. రాబోయే రోజుల్లో అతను కెప్టెన్‌గా జట్టును సమర్ధవంతంగా నడిపించగలడని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.