ఆ ఇద్దరికి మిగిలింది ఒకే అవకాశం
Gavaskar Makes Big Statement After Another Flop Show from Pujara and Rahane.టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు
By తోట వంశీ కుమార్ Published on 4 Jan 2022 11:15 AM ISTటీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు పుజారా, అజింక్య రహానేలు తమ పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో పుజారా కేవలం 3 పరుగులు చేయగా.. రహానే గోల్డెన్ డక్ గా ఔట్ అయ్యాడు. దీంతో వీరిద్దరిపై వేటు వేయాలనే డిమాండ్లు మరింత ఊపందుకున్నాయి. గత కొంత కాలంగా వీరిద్దరు ఫామ్‌లో లేరు. అయినప్పటికీ అనుభవం ఉందన్న ఒకే ఒక్క కారణంతో దక్షిణాఫ్రికా పర్యటనకు వీరిద్దరిని సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ అవకాశాన్ని ఈ ఇద్దరూ ఆటగాళ్లు స్వదినియోగం చేసుకోలేకపోతున్నారు.
ఈ నేథప్యంలో భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. చివరగా ఒకే ఒక్క అవకాశమే మిగిలి ఉందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. పుజారా, రహానే లు ఇలా వరుస బంతుల్లో విఫలం అవ్వడం చూస్తుంటే సగటు వ్యక్తి ఎవరైనా.. వాళ్లు టెస్టుల్లో కొనసాగడానికి ఇక ఒక్క అవకాశమే మిగిలి ఉందని అనుకుంటారు. జట్టులో వారి స్థానాలపై ఇప్పటికే సందేహాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్‌లో విఫలం కావడం విచారకమన్నారు. ఇకపై వాళ్లు భారత జట్టులో కొనసాగాలంటే రెండో ఇన్నింగ్స్‌లో బాగా ఆడాలని గవాస్కర్ సూచించారు. పుజారా మూడు అంకెల స్కోర్ అందుకోని మూడు సంవత్సరాలు కాగా.. రహానే గతేడాది మెల్‌బోర్న్ టెస్టులో శతకం బాదాడు. అప్పటి నుంచి మరో భారీ ఇన్నింగ్స్ ఆడలేదు. మరోవైపు శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ వంటి యువ ఆటగాళ్లు రూపంలో వీరికి తీవ్రమైన పోటీ నెలకొంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సెంచూరియన్ టెస్టులో విజయంతో రెండో టెస్టులో ఫేవరేట్‌గా బరిలోకి దిగిన భారత్ తొలి రోజు తడబడింది. మిడిల్ ఆర్డర్ పేలవ ప్రదర్శన కొనసాగించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్, ఓపెనర్ కేఎల్ రాహుల్(50), అశ్విన్(46) పరుగులతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో జాన్సన్ నాలుగు, అలివీర్ మూడు, రబాడ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి రోజు ఆటముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. కెప్టెన్ ఎల్గర్ 11, కీగన్ పీటర్సన్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. వెన్నునొప్పి కారణంగా విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు.