ఆ ఇద్ద‌రినీ కోచింగ్ స్టాప్‌గా తీసుకోనున్న గంభీర్‌..!

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నియమించింది.

By Medi Samrat  Published on  10 July 2024 9:55 AM GMT
ఆ ఇద్ద‌రినీ కోచింగ్ స్టాప్‌గా తీసుకోనున్న గంభీర్‌..!

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నియమించింది. ఇటీవల రాహుల్ ద్రవిడ్ కోచ్ స్థానం నుంచి త‌ప్పుకోగా.. అత‌డి స్థానానికి గంభీర్ న్యాయం చేస్తాడని బోర్డు ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక మాజీ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ కూడా నిష్క్రమించారు. దీంతో గంభీర్ రాకతో భారత్‌ కోచింగ్ స్టాప్ కూడా మార‌నుంది. ఇప్పుడు ఆ స్థానాల‌ను కూడా భర్తీ చేయాల్సి ఉంది. తన సిబ్బందిని తానే ఎంపిక చేసుకుంటానని గంభీర్ ఇప్పటికే షరతు పెట్టిన‌ట్లు నివేదిక‌లు చెబుతున్నాయి.

ఈ నేప‌థ్యంలోనే గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్ అసిస్టెంట్ కోచ్‌గా అభిషేక్ నాయర్, బౌలింగ్ కోచ్‌గా మాజీ టీమిండియా ఆట‌గాడు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాస్ట్ బౌలర్ R వినయ్ కుమార్‌ను కోరుకుంటున్నట్లు కూడా నివేదిక‌లు చెబుతున్నాయి.

RevSportz నివేదిక ప్రకారం.. గంభీర్ సహాయ కోచ్‌గా అభిషేక్ నాయర్, బౌలింగ్ కోచ్‌గా R వినయ్ కుమార్ పేర్లను BCCIకి సమర్పించారని తెలుస్తుంది. గంభీర్ కోచ్ పదవీకాలం శ్రీలంక సిరీస్ నుండి ప్రారంభమవుతుంది. గంభీర్ సిఫార్సులపై బీసీసీఐ వెంటనే చర్యలు తీసుకోవలసి ఉంటుంది.

గంభీర్ ప్రకటనలో 'మన త్రివర్ణ పతాకానికి, మన ప్రజలకు, మన దేశానికి సేవ చేయడం గౌరవంగా భావిస్తున్నాను. రాహుల్ ద్రవిడ్, అతని సపోర్టు స్టాఫ్ టీమ్‌తో కలిసి ఆదర్శంగా నడిచినందుకు నేను అభినందించాలనుకుంటున్నాను. టీం ఇండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం పట్ల నేను గౌరవంగా, ఉత్సాహంగా ఉన్నాను. నేను ఆడుతున్న రోజుల్లో భారతీయ జెర్సీని ధరించడం నాకు ఎప్పుడూ గర్వంగా అనిపించింది. నేను ఈ కొత్త పాత్రను స్వీకరించినప్పుడు దానికి భిన్నంగా ఏమీ ఉండదని భావిస్తున్నా. బీసీసీఐ, నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్, సపోర్టు స్టాఫ్, ముఖ్యంగా ఆటగాళ్లతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నానని గంభీర్ చెప్పాడు. గంభీర్ భారత కోచ్‌గా జూలై 27 నుండి ప్రారంభమయ్యే మూడు T20Iలు, మూడు ODIల కోసం శ్రీలంక పర్యటనకు వెళ్ల‌నున్నారు.

బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ మాట్లాడుతూ.. జట్టుతో అద్భుతమైన ప్రదర్శన చేసినందుకు మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు బోర్డు కృతజ్ఞతలు తెలియజేస్తోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ నాయకత్వంలో టీమ్ ఇండియా ఇప్పుడు కొత్త ప్రయాణం ప్రారంభించింది. అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపే, సులక్షణా నాయక్‌లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ మంగళవారం గంభీర్ పేరును ఏకగ్రీవంగా సిఫార్సు చేసిందని బోర్డు తెలిపింది. మే 13న బీసీసీఐ ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది.

Next Story