'టీఆర్పీ కంటే మా ప్రజల ప్రాణాలే ముఖ్యం..' : భారత్‌-పాక్‌ మ్యాచ్‌లపై కోచ్ గంభీర్ సీరియ‌స్ కామెంట్స్‌

'టీఆర్పీ కంటే మా ప్రజల ప్రాణాలే ముఖ్యం..' అని భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అన్నారు.

By Medi Samrat
Published on : 22 May 2025 6:58 PM IST

టీఆర్పీ కంటే మా ప్రజల ప్రాణాలే ముఖ్యం.. : భారత్‌-పాక్‌ మ్యాచ్‌లపై కోచ్ గంభీర్ సీరియ‌స్ కామెంట్స్‌

'టీఆర్పీ కంటే మా ప్రజల ప్రాణాలే ముఖ్యం..' అని భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అన్నారు. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌కు సంబంధించిన ప్రశ్నకు ఆయన తన స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇరుదేశాల ఆడితే టీఆర్పీ వచ్చిన అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు లాభపడతాయని, దానికంటే మన దేశ ప్రజల భద్రతే ముఖ్యమని అన్నారు. ఈ సందర్భంగా పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని కూడా ప్రస్తావించిన గంభీర్, పాకిస్థాన్‌తో క్రీడా సంబంధాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. దీనికి ప్రతీకారంగా మే 7న పాకిస్థాన్‌పై 'ఆపరేషన్ సింధూర్' కింద భారత సైన్యం పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని అనేక ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ ఘటనలో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఇది మాత్రమే కాదు, పాక్ ఆర్మీకి చెందిన తొమ్మిది ఎయిర్‌బేస్‌లు కూడా ధ్వంసమయ్యాయి.

పాకిస్థాన్ చేసిన ఈ పిరికిపంద చర్యపై యావత్ దేశమంతా ఇప్పటికీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. భారత్‌, పాకిస్తాన్ మధ్య క్రీడా సంబంధాలను నిలిపివేయాలని క్రీడా ప్రపంచంలోని చాలా మంది ప్రముఖులు డిమాండ్ చేశారు. ఇప్పుడు భారత మాజీ బ్యాట్స్‌మెన్ గౌతమ్ గంభీర్ కూడా దీని గురించి మాట్లాడాడు.

గురువారం జరిగిన గోఫెస్ట్ కార్యక్రమంలో.. టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌ని ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ నుండి TRP ప్రకటనల ఏజెన్సీల ప్రయోజనాల గురించి ఒక ప్రశ్న అడిగినప్పుడు.. ఆయ‌న‌ దానికి నిష్కపటంగా సమాధానం చెప్పాడు. ఈ దేశంలో మన ప్రజల, మన సైనికుల ప్రాణాల కంటే ముఖ్యమైనది మరొకటి లేదు. రాత్రి పగలు తేడా లేకుండా మన సరిహద్దుల్లో కాపలా కాస్తున్న మన సైనికుల కంటే ముఖ్యమైనది మరొకటి లేదన్నాడు.

పాకిస్థాన్‌తో క్రీడా సంబంధాలను ముగించడంపై గౌతమ్ గంభీర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. పహల్గామ్ దాడి తర్వాత గంభీర్ బలమైన వైఖరిని ప్రదర్శించాడు.. ఆసియా కప్, ఐసీసీ టోర్నమెంట్లలో కూడా భారత్‌, పాకిస్తాన్‌తో ఆడకూడదని చెప్పాడు. ఉగ్రవాదం అంతమయ్యే వరకు జాతీయ జట్టు తన చిరకాల ప్రత్యర్ధితో ఏ స్థాయిలోనూ ఆడకూడదని భారత ప్రధాన కోచ్ గంభీర్ అన్నాడు.

మేం ఆడాలా వద్దా అనేది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయమని గంభీర్ అన్నాడు. భారత సైనికులు, ప్రజల ప్రాణాల కంటే క్రికెట్ మ్యాచ్ లేదా బాలీవుడ్ లేదా మరేదైనా కార్యక్రమం ముఖ్యమైనది కాదని నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. మ్యాచ్‌లు జరుగుతూనే ఉంటాయి, సినిమాలు తీయడం కొనసాగుతుంది. గాయకులు ప్రదర్శనలు ఇస్తూనే ఉంటారు, కానీ మ‌న‌ కుటుంబంలో ప్రియమైన వ్యక్తిని కోల్పోవడం కంటే పెద్ద దుఃఖం ఉండ‌ద‌న్నాడు.

దశాబ్ద కాలంగా భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. అదే సమయంలో 2007 నుంచి భారత్‌ పాకిస్థాన్‌లో ఎలాంటి సిరీస్‌లు ఆడలేదు. ఇప్పటి వరకు ఇరు జట్లు బహుళజాతి టోర్నీల్లో మాత్రమే ఆడాయని, అలాంటి టోర్నీల్లో కూడా భారత జట్టు పాకిస్థాన్‌తో ఆడకూడదని గంభీర్ అన్నాడు. 'పాకిస్థాన్‌తో ఆడకూడదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. సీమాంతర ఉగ్రవాదం అంతమయ్యే వరకు భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య ఏమీ జరగకూడదన్నాడు.

Next Story