ద్రావిడ్ విష‌యంలో రోహిత్‌పై గంభీర్ ఫైర్‌

భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తన దూకుడు ప్రకటనలతో వార్తల్లో నిలుస్తుంటాడు.

By Medi Samrat  Published on  29 Nov 2023 5:12 AM GMT
ద్రావిడ్ విష‌యంలో రోహిత్‌పై గంభీర్ ఫైర్‌

భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తన దూకుడు ప్రకటనలతో వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మను గంభీర్ టార్గెట్ చేశాడు. కోచ్ రాహుల్ ద్రవిడ్ కోసం జట్టు ప్రపంచకప్ గెలవాలని కోరుకుంటున్నట్లు ఫైనల్‌కు ముందు రోహిత్ చెప్పాడు. 2003లో ఫైనల్‌లో ఓడిన జట్టులో ద్రవిడ్ సభ్యుడు. ఆ తర్వాత ద్రవిడ్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా 2007 ప్రపంచకప్‌లో మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించింది. ఇటువంటి పరిస్థితితుల నేప‌థ్యంలో రోహిత్ శర్మ తన కలలతో పాటు ద్ర‌విడ్‌ కలను కూడా నెరవేర్చాలనుకున్నాడు.

ఫైనల్‌కు ముందు రోహిత్.. ద్రవిడ్‌పై చాలా ప్రశంసలు కురిపించాడు. కోచ్ కోసం ప్రపంచకప్ గెలవాలని తాను.. ఇతర ఆటగాళ్లు కోరుకుంటున్నామ‌ని చెప్పాడు. హిట్‌మ్యాన్ ప్రకటనపై గౌతమ్ గంభీర్ చాలా కోపంగా ఉన్నాడు. అతడు రోహిత్‌ను తీవ్రంగా విమర్శించాడు. 2011 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న గంభీర్.. ప్రతి ఆటగాడు, కోచ్ ప్రపంచ కప్ గెలవాలని కోరుకుంటారని.. అయితే ప్రతి ఒక్కరూ.. వ్యక్తి కంటే ముందు దేశం కోసం ప్రపంచ కప్ గెలవాలని అన్నాడు. 2011లో అందరూ సచిన్ టెండూల్కర్ పేరునే చెప్పారు.. కానీ ఆయ‌న‌ దేశం పేరును చెప్పాడని పేర్కొన్నాడు.

గంభీర్ ఒక ఇంటర్వ్యూలో "ప్రతి ఒక్కరూ ప్రపంచ కప్ గెలవాలని కోరుకుంటారు. కానీ ప్రతిసారీ ప్రజలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు." 2011లో కూడా ఇదే జరిగింది. మీరు ఫలానా వ్యక్తి కోసం ప్రపంచకప్ గెలవాలని కోరుకుంటున్నారంటే అది తప్పు. ఆ వ్యక్తి ఎవరన్నది ముఖ్యం కాదు. మీరు మీ దేశం కోసం ప్రపంచ కప్ గెలవడానికి ప్రయత్నించాలి. ఒక నిర్దిష్ట వ్యక్తి కోసం ఏదైనా అనుకుంటే.. దానిని బహిరంగంగా చెప్పకండి. దేశం కోసం ప్రపంచకప్ గెలవడం ఎవరికైనా చాలా ముఖ్యం. 2011లో దేశం కోసం ప్రపంచకప్‌ గెలవాలని కోరుకున్నప్పుడు.. ఇలాంటి ప్రశ్నే నన్ను అడిగారు. నేను ఎప్పుడూ దేశం కోసం బ్యాటింగ్ చేస్తానని తెలిపాడు.

ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు రెండోసారి ఓడిపోయింది. అంతకుముందు 2003లో కూడా కంగారూలపై టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైన‌ల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి.. ఆరోసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.

Next Story