దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వన్డే సిరీస్ విజయం తర్వాత పలు విషయాలపై స్పందించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్థ్ జిందాల్‌ను ఉద్దేశించి గంభీర్ పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. టెస్టు సిరీస్ ఓటమికి కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడటమే కారణమని ఎవరూ మాట్లాడలేదు. పిచ్ గురించే అందరూ చర్చించారన్నాడు గంభీర్. క్రికెట్‌తో సంబంధం లేని వారు కూడా అభిప్రాయాలు చెప్పారు. ఓ ఐపీఎల్ జట్టు యజమాని అయితే విభజన కోచింగ్ గురించి మాట్లాడారు.. ఎవరి పని వారు చూసుకుంటే మంచిది. నేను ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోనప్పుడు, నా విషయంలోకి రావడానికి వారికి హక్కు లేదని గంభీర్ స్పష్టం చేసాడు.
టెస్టుల్లో భారత ప్రదర్శనపై జిందాల్ సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. స్వదేశంలో ఇంత ఘోర పరాజయం చూడలేదు. టెస్టులకు ప్రత్యేక కోచ్‌ను నియమించాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. ఈ విమర్శలపై గంభీర్ తనదైన శైలిలో స్పందించాడు. రాబోయే టీ20 సిరీస్‌కు శుభ్‌మన్ గిల్ అందుబాటులో ఉంటాడని గంభీర్ స్పష్టం చేశాడు.