కోర్టుకెక్కిన గౌతమ్ గంభీర్..రూ. 2.5 కోట్ల నష్టపరిహారం డిమాండ్
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్, మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
By - Knakam Karthik |
కోర్టుకెక్కిన గౌతమ్ గంభీర్..రూ.2.5 కోట్ల నష్టపరిహారం డిమాండ్
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్, మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డీప్‌ఫేక్ వీడియోలు మరియు అనధికార వాణిజ్య కార్యకలాపాల ద్వారా తన గుర్తింపును దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ జ్యోతి సింగ్ నేతృత్వంలోని బెంచ్ ఈ కేసును విచారించగా, పిటిషన్ పత్రాల్లో ప్రతివాదుల వివరాలకు సంబంధించి కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నట్లు కోర్టు గుర్తించింది. వీటిని సరిదిద్ది తాజా మెమో దాఖలు చేయాలని గంభీర్ తరఫు న్యాయవాదిని ఆదేశిస్తూ, తదుపరి విచారణను సోమవారానికి (మార్చి 23) వాయిదా వేసింది.
గంభీర్ తరఫు న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్ కోర్టులో వాదిస్తూ.. ఆన్‌లైన్‌లో గంభీర్ ప్రతిష్టను దెబ్బతీసేలా అనేక నకిలీ వీడియోలు ప్రచారంలో ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా ఒక మ్యాచ్‌లో జట్టు ఓడిపోయిన తర్వాత గంభీర్ కోచ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు, తోటి ఆటగాళ్లతో అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించారని వివరించారు. ఈ వీడియోలు లక్షలాది వ్యూస్ సాధించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, చివరకు మహాత్మా గాంధీ చిత్రానికి గంభీర్ ముఖాన్ని మార్ఫింగ్ చేయడం వంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరిగాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
తన అనుమతి లేకుండా తన పేరు, ముఖం (Image), గొంతు (Voice) లేదా గుర్తింపును సోషల్ మీడియా మరియు ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో వాణిజ్య ప్రయోజనాల కోసం వాడకూడదని గంభీర్ కోరారు. ఈ పిటిషన్‌లో మెటా, ఎక్స్ (ట్విట్టర్), గూగుల్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి దిగ్గజ సంస్థలతో సహా మొత్తం 16 మందిని ప్రతివాదులుగా చేర్చారు. తన గుర్తింపును దుర్వినియోగం చేసినందుకు గాను రూ. 2.5 కోట్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని, అలాగే ఆ నకిలీ కంటెంట్ ద్వారా వచ్చిన లాభాల లెక్కలను సమర్పించాలని ఆయన డిమాండ్ చేశారు.