చివరి నిమిషంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్ఎల్) ను వదిలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) లో చేరుతున్న విదేశీ ఆటగాళ్లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఛైర్మన్ మోసిన్ నఖ్వీ గట్టి హెచ్చరిక జారీ చేశారు. గత రెండేళ్లుగా పీఎస్ఎల్, ఐపీఎల్ తేదీలు ఒకే రోజున వస్తుండటంతో.. చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు.
శ్రీలంక ఆటగాడు దాసున్ షనక ఇటీవల ఐపీఎల్‌లో చేరడానికి లాహోర్ ఖలందర్స్‌ను విడిచిపెట్టాడు. గాయపడిన సామ్ కర్రన్ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ అతడిని తీసుకుంది. షనక కంటే ముందు జింబాబ్వేకు చెందిన బ్లెస్సింగ్ ముజరబాని కూడా ఇస్లామాబాద్ యునైటెడ్‌ను విడిచి కేకేఆర్‌లో చేరాడు. చివరి నిమిషంలో పీఎస్ఎల్‌ను విడిచి ఐపీఎల్‌లో చేరుతున్న ఆటగాళ్లపై పీసీబీ ఛైర్మన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి ఆటగాళ్లపై బోర్డు కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టంగా తెలిపారు. చివరి నిమిషంలో మోసానికి పాల్పడే ఆటగాళ్లపై నిబంధనల ప్రకారం చర్య తీసుకుంటామని మోసిన్ నఖ్వీ అన్నారు.
గత సంవత్సరం పెషావర్ జల్మీని విడిచి ముంబై ఇండియన్స్‌లో చేరిన తర్వాత కార్బిన్ బాష్‌పై కూడా ఏడాది పాటు నిషేధం విధించారు. ఈసారి కూడా అదే జరగనుంది.
సంవత్సరంలో వేరే ఖాళీ సమయం లేనందున పీఎస్ఎల్ తేదీలను మార్చడం సాధ్యం కాదని నఖ్వీ అన్నారు. అయితే, కొంతమంది ఆటగాళ్లు వెళ్ళిపోతున్నప్పటికీ చాలా మంది అద్భుతమైన విదేశీ ఆటగాళ్లు పాకిస్తాన్‌కు వస్తున్నారని కూడా ఆయన చెప్పారు.
షనక, ముజరబాని మాత్రమే కాకుండా గుడకేష్ మోతీ, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, ఓత్నీల్ బార్ట్‌మన్, స్పెన్సర్ జాన్సన్‌తో సహా పలువురు ఇతర ఆటగాళ్లు కూడా వివిధ కారణాలతో పీఎస్‌ఎల్ నుంచి తమ పేర్లను ఉపసంహరించుకున్నారు. ఈసారి పీఎస్ఎల్ మార్చి 26న ప్రారంభం కానుండగా.. ఐపీఎల్ సరిగ్గా రెండు రోజుల తర్వాత అంటే మార్చి 28న మొదలుకానుంది.