క్రీడా ప్రపంచంలో విషాదం చోటు చేసుకుంది. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ బ్రూస్ పైరౌడో కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో న్యూజిలాండ్‌లోని తన నివాసంలో గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 91 సంవత్సరాలు.
14 ఏప్రిల్ 1931న జన్మించిన బ్రూస్.. 1953 నుంచి 1957 మధ్య కాలంలో వెస్టిండీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. అప్పట్లో టెస్టులు మాత్రమే ఉండేవి. మొత్తం 13 టెస్టుల్లో వెస్టిండీస్ తరుపున ఆడిన బ్రూస్ 454 పరుగులు చేశాడు. అందులో ఓ శతకం కూడా ఉంది. ఆ శతకం కూడా 1953లో ఫోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో సాధించాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో బ్రూస్ తన చివరి టెస్టును ఆడాడు.
1956లో వెస్టిండీస్ టీమ్ న్యూజిలాండ్‌లో పర్యటించింది. అక్కడే బ్రూస్ ఓ యువతిని చూసి ప్రేమలో పడ్డాడు. అనంతరం ఆ అమ్మాయినే పెళ్లిచేసుకుని వెస్టిండీస్‌ను వదిలి న్యూజిలాండ్ వెళ్లిపోయి స్థిరపడ్డాడు. న్యూజిలాండ్‌లో స్థిరపడిన తరువాత అక్కడి దేశవాళీ టోర్నీలో బ్రూస్ ఆడాడు. 1967లో అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఆయన మృతి పట్ల వెస్టిండీస్ క్రికెటర్లతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు సంతాపం తెలియజేశారు.