పంతం నెగ్గించుకున్న గంభీర్.. టీమిండియా బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు
భారత జట్టు బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ మోర్నీ మోర్కెల్ నియమితులయ్యారు
By Medi Samrat Published on 14 Aug 2024 11:23 AM GMTభారత జట్టు బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ మోర్నీ మోర్కెల్ నియమితులయ్యారు. మోర్కెల్ కాంట్రాక్ట్ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌ను టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా బోర్డు నియమించింది, అయితే సహాయక సిబ్బందిని మాత్రం ప్రకటించలేదు. రాహుల్ ద్రవిడ్ హయాంలో పరాస్ మాంబ్రే జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. మోర్కెల్‌ను కొత్త బౌలింగ్ కోచ్‌గా నియమించినట్లు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) సెక్రటరీ జయ్ షా చెప్పినట్లు వార్తా సంస్థ పిటిఐ పేర్కొంది.
షా వార్తా సంస్థ పిటిఐతో మాట్లాడుతూ.. 'అవును, సీనియర్ భారత పురుషుల జట్టు బౌలింగ్ కోచ్‌గా మోర్నే మోర్కెల్ నియమితులయ్యారు. దక్షిణాఫ్రికాకు చెందిన 39 ఏళ్ల మోర్కెల్.. కొత్త ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మొదటి ఎంపిక. ఐపీఎల్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్‌లో ఇద్దరూ కలిసి పనిచేశారు. అంతకుముందు.. గంభీర్, మోర్కెల్ మూడు సీజన్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) జట్టులో ఒకరితో ఒకరు కలిసి పనిచేశారని పేర్కొన్నాడు. మోర్కెల్ దక్షిణాఫ్రికా తరపున 86 టెస్టులు, 117 ODIలు , 44 T20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. అందులో అతను మొత్తం 544 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టాడు.
మోర్కెల్ భారత జట్టు బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మొదటగా బంగ్లాదేశ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 19 నుంచి ఇరు జట్ల మధ్య ఈ సిరీస్ ప్రారంభం కానుంది. బౌలింగ్ కోచ్‌గా మోర్కెల్ పేరు చాలా రోజులుగా చర్చలో ఉంది, కానీ ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. మోర్కెల్ నియామకంతో దాదాపు పదేళ్ల తర్వాత బీసీసీఐ విదేశీ కోచ్‌ను నియమించింది. మాజీ ప్రధాన కోచ్ డంకన్ ఫ్లెచర్ తర్వాత తొలిసారిగా ఓ విదేశీయుడు భారత కోచింగ్ టీమ్‌లో భాగమయ్యాడు.