క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన‌ బిస్మా మరూఫ్

పాకిస్థాన్ క్రికెటర్ బిస్మా మరూఫ్ గురువారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఓ ప్రకటన విడుదల చేసింది

By Medi Samrat  Published on  25 April 2024 12:15 PM GMT
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన‌ బిస్మా మరూఫ్

పాకిస్థాన్ క్రికెటర్ బిస్మా మరూఫ్ గురువారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఓ ప్రకటన విడుదల చేసింది. బిస్మా మరూఫ్ తన 17 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌కు బ్రేకులు వేసిందని వెల్ల‌డించింది. మరూఫ్ 2006లో పాకిస్థాన్ తరఫున క్రికెట్ ఆరంగ్రేటం చేసింది.

బిస్మా మరూఫ్ పాకిస్థాన్ తరఫున 136 వ‌న్డేలు, 140 T20లు ఆడింది. వ‌న్డేల‌లో 3,369, టీ20ల‌లో 2893 పరుగులు చేసింది. ఆమె పేరు మీద 33 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 80 వికెట్లు కూడా తీసింది. ఆమె అత్యుత్తమ ప్రదర్శన 4 వికెట్లు. రిటైర్మెంట్ సంద‌ర్భంగా పీసీబీకి త‌న‌ ప్రకటనతో పాటు తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో అభిమానుల కోసం భావోద్వేగ పోస్ట్‌ను పంచుకుంది. అందులో "అందమైన జ్ఞాపకాల నిధిని సేకరించాను" అని రాసింది.

ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ బిస్మా మరూఫ్ డిసెంబర్ 13, 2006న భారత్‌పై పాకిస్థాన్ తరఫున వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి.. ఏప్రిల్ 23, 2024న వెస్టిండీస్‌తో తన చివరి ODI మ్యాచ్ ఆడింది. 2009లో టీ20 క్రికెట్‌లోకి అడుగుపెట్టిన మరూఫ్ చివరిసారిగా 2023లో ఆడింది. వన్డేల్లో సెంచరీ చేయకుండానే మూడు వేలకు పైగా పరుగులు చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా బిస్మా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను పంచుకుంటూ.. నేను చాలా ఇష్టపడే క్రీడ నుండి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. సవాళ్లు, విజయాలు, మరపురాని జ్ఞాపకాలతో నిండిన అద్భుతమైన ప్రయాణం ఇది. మొదటి నుంచి ఇప్పటి వరకు నా క్రికెట్ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన నా కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నన్ను ఆదరిస్తున్న అభిమానులందరికీ కృతజ్ఞతలు అని రాసుకొచ్చింది.

బిస్మా మరూఫ్ నాలుగుసార్లు (2009, 2013, 2017, 2022) వన్డే ప్రపంచకప్ ఆడింది. 2022లో జట్టుకు కెప్టెన్‌గా కూడా ఉంది. ఆమె 2009, 2023 మధ్య T20 క్రికెట్‌లో ఎనిమిది ప్రపంచ కప్‌లు ఆడింది. 2020, 2023లో జట్టుకు కెప్టెన్‌గా ఉంది.

Next Story