Salim Durani : భార‌త మాజీ స్పిన్ ఆల్‌రౌండ‌ర్ క‌న్నుమూత‌

భారత మాజీ క్రికెటర్ సలీం దురానీ వృద్ధాప్య స‌మ‌స్య‌ల‌తో ఆదివారం ఉదయం జామ్‌నగ‌ర్‌లోని త‌న నివాసంలో తుదిశ్వాస విడిచారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 April 2023 11:03 AM IST
Salim Durani, Former India cricketer

భారత మాజీ క్రికెటర్ సలీం దురానీ

భారత మాజీ క్రికెటర్ సలీం దురానీ వృద్ధాప్య స‌మ‌స్య‌ల‌తో ఆదివారం ఉదయం జామ్‌నగ‌ర్‌లోని త‌న నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌స్సు 88 సంవ‌త్సరాలు. స్పిన్ ఆల్‌రౌండ‌ర్ అయిన దురానీ భారతదేశం తరపున 29 టెస్టులు ఆడి 75 వికెట్లు తీశాడు. అలాగే బ్యాటింగ్‌లో 1202 ప‌రుగులు చేశారు. అత‌డి అత్య‌ధిక స్కోరు 104 ప‌రుగులు వెస్టిండీస్ పై. 1961-62లో ఇంగ్లాండ్ పై 2-0 తేడాతో భార‌త్ సిరీస్ సాధించ‌డంలో దురానీ కీల‌క పాత్ర పోషించాడు.

1934లో అఫ్గానిస్థాన్‌లో దురానీ జ‌న్మించారు. అత‌డి 8 నెల‌ల వ‌య‌స్సు ఉన్న‌ప్పుడు అత‌డి కుటుంబం క‌రాచీకి వ‌ల‌స వ‌చ్చింది. 1947లో భార‌త్‌-పాక్ విభ‌జ‌న స‌మ‌యంలో దురానీ కుటుంబం భార‌త్‌కు వ‌చ్చారు. ముంబై వేదిక‌గా 1960లో ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో దురానీ టీమ్ఇండియా త‌రుపున అరంగ్రేటం చేశారు. ఆల్‌రౌండ‌ర్‌గా గుర్తింపు పొందారు. చివ‌ర‌గా 1973లో ఇంగ్లాండ్‌తో మ్యాచ్ ఆడారు.

క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన అనంత‌రం న‌టుడు ప్ర‌వీన్ బాబీతో క‌లిసి "చ‌రిత్ర" అనే బాలీవుడ్ చిత్రంలో న‌టించారు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 33.37 సగటుతో 14 సెంచ‌రీలు బాది 8,545 పరుగులు చేశారు. భార‌త ప్ర‌భుత్వం అందించే అత్యున్న‌త క్రీడా పుర‌స్కారం "అర్జున అవార్డు"ను అందుకున్న తొలి క్రికెటర్ దురానీనే కావ‌డం విశేషం.

అత‌డి మృతి ప‌ట్ల ప‌లువురు క్రికెట‌ర్లు సంతాపం తెలియ‌జేస్తున్నారు. టీమ్ఇండియా మాజీ కోచ్ ర‌విశాస్త్రి ఆయ‌న‌తో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Next Story