టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు సురేశ్ రైనా ఇంట తీవ్ర విషాదం

Former India batsman Suresh Raina's father passes away.టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు సురేశ్‌ రైనా ఇంట తీవ్ర విషాదం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Feb 2022 3:36 PM IST
టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు సురేశ్ రైనా ఇంట తీవ్ర విషాదం

టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు సురేశ్‌ రైనా ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. సురేశ్ రైనా తండ్రి త్రిలోక్​చంద్​ రైనా క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న క్యాన్స‌ర్ వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. ఆదివారం ఆయ‌న ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఘ‌జియాబాద్‌లోని త‌న నివాసంలో తుది శ్వాస విడిచారు. త్రిలోక్‌చంద్ రైనా సైన్యంలో ప‌ని చేశారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో బాంబులు త‌యారు చేయ‌డంలో కూడా ఆయ‌న‌కు ప్రావీణ్యం ఉంది.

త్రిలోక్‌చంద్ రైనా పూర్వీకుల‌ది జ‌మ్ముకశ్మీర్‌లోని రైనావారి గ్రామం. 1990లలో కశ్మీరీ పండిట్ల హత్యల ఘటన అనంతరం ఆయన ఆ గ్రామాన్ని విడిచిపెట్టిన త్రిలోక్‌చంద్ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మురాద్‌న‌గ‌ర్‌లో స్థిర‌ప‌డ్డారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న నెలకు రూ.10వేలు సంపాదించేశారు. అయితే.. వ‌చ్చే జీతంతో సురేష్ రైనా క్రికెట్ కోచింగ్ కు కూడా స‌రిపోది కాదు. 1998లో రైనాను లఖ్​నవూలోని గురుగోవింద్​ సింగ్ స్పోర్ట్స్​ కళాశాలలో చేర్పించారు. కాశ్మీర్ విషాదం గురించి తన తండ్రికి గుర్తుకు తెచ్చే విషయాలేవీ ప్రస్తావించకుండా జాగ్రత్తపడతానని రైనా చెబుతుండేవాడు.

ఇక టీమ్ఇండియా త‌రుపున సురేశ్ రైనా 226 వ‌న్డేలు, 18 టెస్టులు, 78 టీ20లు ఆడాడు. వ‌న్డేల్లో 5,615, టెస్టుల్లో 768, టీ 20ల్లో 1,604 ప‌రుగులు చేశాడు. 2020 ఆగస్టులో ధోనీతో పాటే రిటైర్మెంట్​ ప్రకటించాడు. ఇక ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్)లో 205 మ్యాచ్‌లు ఆడిన రైనా 5,528 ప‌రుగులు చేశారు. రైనా ఎక్కువ‌గా ఐపీఎల్‌లో చైన్నై సూప‌ర్‌కింగ్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. ఆ జ‌ట్టుపై నిషేదం ప‌డిన సంద‌ర్భంలో గుజరాత్ సూపర్​జెయింట్స్ త‌రుపున ఆడాడు. కాగా.. ఐపీఎల్ 2022 వేలానికి చెన్నై జ‌ట్టు అత‌డిని విడిచిపెట్టింది.

Next Story