విషాదం.. మాజీ అంపైర్ అసద్ రవూఫ్ క‌న్నుమూత‌

Former elite umpire Asad Rauf dies aged 66.మాజీ ఐసిసి ఎలైట్ ప్యానెల్ అంపైర్ అసద్ రవూఫ్ గుండెపోటుతో లాహోర్‌లోక‌న్నుమూశారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Sept 2022 7:59 AM IST
విషాదం.. మాజీ అంపైర్ అసద్ రవూఫ్ క‌న్నుమూత‌

క్రికెట్ ప్ర‌పంచంలో విషాదం నెల‌కొంది. పాకిస్తాన్‌కు చెందిన మాజీ ఐసిసి ఎలైట్ ప్యానెల్ అంపైర్ అసద్ రవూఫ్ గుండెపోటుతో లాహోర్‌లో క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌స్సు 66 సంవ‌త్స‌రాలు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 64 టెస్టులు (49 ఆన్-ఫీల్డ్ అంపైర్‌గా, 15 టీవీ అంపైర్‌గా), 139 వ‌న్డేలు, 28 టీ మ్యాచులు క‌లిపి మొత్తంగా 231మ్యాచుల‌కు అంపైర్ గా విధులు నిర్వ‌ర్తించాడు. ఆయ‌న మృతి ప‌ట్ల ప‌లువురు క్రికెట‌ర్లు, అభిమానులు సంతాపం తెలియ‌జేస్తున్నారు.

2000 సంవత్సరంలో అంపైర్‌గా కెరీర్ ను ప్రారంభించిన రవూఫ్ 2006లో ఐసీసీ(అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌) యొక్క ఎలైట్ ప్యానెల్‌కు పదోన్నతి పొందాడు. పాకిస్తాన్ నుంచి అలీమ్ దార్ త‌రువాత విజ‌య‌వంత‌మైన అంపైర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌) మ్యాచుల‌కు కూడా అంపైర్‌గా ప‌ని చేశాడు.

కాగా.. 2013 సంవ‌త్స‌రం అత‌డి కెరీర్‌లో చీక‌టి అధ్యాయంగా మిగిలింది. ఆ సీజ‌న్ ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం రవూఫ్ మెడ‌కు చుట్టుకుంది. బుకీల నుంచి రవూఫ్ ఖ‌రీదైన బ‌హుమ‌తుల్ని అందుకుని ఫిక్సింగ్ కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో బీసీసీఐ అత‌డిని ప‌క్క‌కు పెట్టి విచార‌ణ‌కు ఆదేశించింది.

సుదీర్ఘ విచార‌ణ అనంత‌రం దోషిగా తేల‌డంతో బీసీసీఐ అత‌డిపై ఐదేళ్ల నిషేదం విధించింది. అదే స‌మ‌యంలో ఐసీసీ ప్యానెల్ నుంచి కూడా తొల‌గించారు. నిషేదం ముగిసిన‌ప్ప‌టికి అత‌డు తిరిగి అంపైర్ బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు. లాహోర్‌లో ఓ బ‌ట్ట‌ల షాపు నిర్వ‌హిస్తున్నాడు. గ‌తంలో ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Next Story