రద్దయింది సరే.. ఆటగాళ్లు ఎలా వెళ్తారు..?
Foreign players want to quit IPL. ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతుండటంతో ఐపీఎల్-2021 సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
By Medi Samrat Published on 4 May 2021 5:09 PM ISTఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతుండటంతో ఐపీఎల్-2021 సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మంగళవారం ప్రకటన విడుదల చేశారు. వేర్వేరు జట్లలో ఇప్పటికే 9 మంది ఆటగాళ్లకు కోవిడ్-19 సోకింది. బయో బబుల్‌లో ఉన్నప్పటికీ క్రికెటర్లు, ఇతర సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో తొలుత టోర్నీని నిరవధికంగా వాయిదా వేయాలని భావించిన బీసీసీఐ.. 31 మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఈ సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
భారతదేశంలో విపరీతంగా కరోనా కేసులు పెరిగిపోతూ ఉండడంతో పలు దేశాలు భారత్ కు విమానాలను రద్దు చేశాయి. ఐపీఎల్ ఆడడానికి వచ్చిన ఆటగాళ్ల దేశాలు కూడా విమానాలను భారత్ కు రద్దు చేశాయి. ఇప్పుడు ఆటగాళ్లను ఎలా పంపిస్తారు అన్నదే ప్రశ్నగా మారింది.
ఐపీఎల్ మధ్యలోనే ఆగిపోవడంతో ఆసీస్ క్రికెటర్ల పరిస్థితి అయోమయంలో పడింది. ఇప్పటికే కొంతమంది లీగ్‌ను వీడి స్వదేశాలకు వెళ్లిపోగా, ఇంకా చాలామంది క్రికెటర్లు ఇక్కడే ఉండిపోయారు. వారితో పాటు ఆసీస్‌కు చెందిన కోచింగ్ స్టాఫ్, సహాయక సిబ్బంది కూడా ఇక్కడే ఉన్నారు. వారి కుటుంబాలు ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మే15 వరకూ భారత్ విమానాలను నిషేధిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో స్వదేశాలకు వెళ్లాలో వారికి అర్థం కావడం లేదు. క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) కూడా తాము ఏమీ చేయలేమని చేతులెత్తేసింది. ఇక బీసీసీఐ, భారత ప్రభుత్వం వారిని స్వదేశాలకు పంపే పనిలో పడింది. మిగిలిన దేశాలకు చెందిన ఆటగాళ్ల తరపున భారత ప్రభుత్వం ఆయా దేశాల ప్రతినిధులతో మాట్లాడుతూ ఉంది. చాలా వరకూ చార్టర్డ్ ఫ్లైట్ లలో ఆటగాళ్లను బీసీసీఐ పంపించనుంది.