ఐర్లాండ్‌తో తొలి టీ20 నేడే.. కుర్రాళ్లపైనే అందరి దృష్టి
First T20 between India and Ireland today.టీ20 ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా భారత జట్టు మరో సిరీస్‌కు
By తోట వంశీ కుమార్ Published on 26 Jun 2022 2:40 PM ISTటీ20 ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా భారత జట్టు మరో సిరీస్‌కు సిద్దమైంది. సీనియర్లు అంతా ఓ వైపు ఇంగ్లాండ్‌తో టెస్ట్ మ్యాచ్‌కు సిద్దం అవుతుంటే.. హార్థిక్ సారథ్యంలోని యువ భారత్ ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు రెడీ అయింది. రెండు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు(ఆదివారం) ఐర్లాండ్‌తో తొలి టీ20లో తలపడనుంది. ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోవాలని బావిస్తున్న కుర్రాళ్లు సత్తా చాటేందుకు ఈ సిరీస్ మంచి అవకాశం కానుంది.
దక్షిణాఫ్రికాతో స్వదేశంలో ఆడిన జట్టే దాదాపుగా ఇక్కడా ఉండగా.. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలిసారి భారత జట్టును నడిపించబోతున్నాడు. రాహుల్ ద్రవిడ్ ప్రధాన జట్టుతో ఉండటంతో వీవీఎస్ లక్ష్మణ్ ఈ సిరీస్‌కు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. బలాబలాలు, గత రికార్డును చూస్తే ఐర్లాండ్‌పై భారత్‌దే స్పష్టంగా పైచేయి కాగా.. సొంతగడ్డపై సత్తా చాటాలని ఐర్లాండ్ భావిస్తోంది.
దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో రాణించిన ఇషాన్ కిషన్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్ నిలకడ కొనసాగించాలని చూస్తున్నారు. గాయం నుంచి కోలుకున్న సూర్యకుమార్ యాదవ్ కు తుది జట్టులో చోటు ఖాయం. అతడు మూడో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. మరీ నాలుగో స్థానంలో ఎవరు ఆడతారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సంజు శాంసన్ పోటీలో ముందున్నప్పటికీ రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా అవకాశాలను కొట్టిపారేయలేం. ఇక బౌలింగ్‌లో ఉమ్రాన్, అర్షదీప్‌లను ఆడించాలంటే హర్షల్, అవేశ్‌ఖాన్‌లు పక్కన బెట్టాల్సి ఉంటుంది. పిచ్‌ను బట్టి రెండో స్పిన్నర్‌గా అక్షర్ పటేల్ లేదంటే పేస్ ఆల్‌రౌండర్‌గా వెంకటేశ్ అయ్యర్‌ను ఎంచుకునే అవకాశం ఉంది.
పసికూన ఐర్లాండ్‌ను తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. ఆ జట్టులో టీ20 స్పెషలిస్టులు చాలా మందే ఉన్నారు. సీనియర్ ఆటగాడు పాల్ స్టిర్టింగ్ ఆ జట్టుకు ప్రధాన బలం. కెప్టెన్ బాల్ బీర్నీ, టెక్టార్ లతో కూడిన బ్యాటింగ్ విభాగం పటిష్టంగానే ఉండగా.. లిటిల్ యంగ్, మెక్‌బ్రైన్, మెకార్తీ వంటి ప్రపంచస్థాయి పేసర్లు ఐర్లాండ్ జట్టు సొంతం. ఇక టీ20 మ్యాచుల్లో ఒక్క ఓవర్‌లో మ్యాచ్ మారిపోతుంది కాబట్టి.. టీమ్ఇండియా అలసత్వానికి ఏ మాత్రం తావివ్వకూడదు.