శతకాలతో సత్తాచాటిన ఫించ్, స్మిత్.. భారత్ ముందు భారీ లక్ష్యం
Finch, Smith smash centuries. కరోనా విరామం తరువాత ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే ఆసీస్ బ్యాట్స్‌మెన్లు..
By Medi Samrat Published on 27 Nov 2020 8:34 AM GMTకరోనా విరామం తరువాత ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే ఆసీస్ బ్యాట్స్‌మెన్లు.. భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై చెలరేగి ఆడారు. సిడ్ని వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆసీస్ 6 వికెట్ల నష్టానికి 374 పరుగుల భారీ స్కోర్ చేసింది.
బ్యాటింగ్ పిచ్‌పై కంగారూ ఓపెనర్లు ఆరోన్ ఫించ్ (114; 124 బంతుల్లో 9 పోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ వార్నర్( 69 ;76 బంతుల్లో 6 పోర్లు) లు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ కు ఈ జోడి 156 పరుగులు జోడించారు. సెంచరీ దిశగా వార్నర్ సాగుతుండగా.. అద్భుత బంతితో షమీ.. వార్నర్‌ను ఔట్ చేశాడు. అప్పటికే కుదిరుకున్న ఫించ్‌కు స్టీవ్ స్మిత్( 105; 66 బంతుల్లో 11 పోర్లు, 4 సిక్సర్లు) జతకలిశాడు. వీరిద్దరు పోటీపడి మరీ పరుగులు రాబట్టారు. శతకం సాధించి మంచి ఊపుమీదున్న ఫించ్‌ను బుమ్రా వెనక్కి పంపాడు. దీంతో రెండో వికెట్‌కు 108 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
ఐపీఎల్‌లో అద్భతంగా ఆడిన స్టొయినిస్‌ను చాహల్ తొలి బంతికే పెవిలియన్ చేర్చాడు. దీంతో వెంట వెంటనే ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో భారత బౌలర్లు పుంజుకుంటారని బావించగా.. అభిమానుల ఆశలపై మాక్స్‌వెల్ నీళ్లు చల్లాడు. వచ్చి రావడంతోనే బౌండరీలతో విరుచుపడ్డాడు. 19 బంతుల్లో 5 పోర్లు, 3 సిక్సర్లు సాయంతో 45 పరుగులు చేశాడు. చివర్లో బారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో.. ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసింది. భారత బౌలర్లలో షమీ మూడు వికెట్లు తీయగా.. బుమ్రా, చాహల్, సైనీ తలా ఒక వికెట్ పడగొట్టారు. భారత్ విజయం సాధించాలంటే.. 375 పరుగులు చేయాలి.