భారత్-ఇంగ్లాండ్.. రద్దైన ఐదో టెస్ట్ మ్యాచ్ షెడ్యూల్ ఖరారు
Fifth India vs England Test to be played in July 2022.కరోనా మహమ్మారి కారణంగా మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్-భారత
By తోట వంశీ కుమార్ Published on 23 Oct 2021 3:32 AM GMTకరోనా మహమ్మారి కారణంగా మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్-భారత్ జట్ల మధ్య జరగాల్సిన ఐదో టెస్టు మ్యాచ్ రద్దైన విషయం తెలిసిందే. అసలు ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తారా..? ఒకవేళ నిర్వహిస్తే ఎప్పుడు నిర్వహిస్తారు..? సిరీస్ ఫలితం ఎలా తీసుకోవాలి వంటి ప్రశ్నలకు తెరపడింది. ఐదో టెస్టుపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. ఐదో టెస్టును రీషెడ్యూల్ చేస్తున్నట్లు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తెలిపింది. వచ్చే ఏడాది ఈ మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. అయిదు టెస్టుల సిరీస్‌లో భాగంగానే ఈ మ్యాచ్ ఉంటుంది. అంటే ఈ ఏడాది సెప్టెంబర్‌లో ముగియాల్సిన అయిదు టెస్టుల సిరీస్ ఫలితం వచ్చే ఏడాది జులైలో తేలనుంది. నాలుగు టెస్టులు ముగిసే సరికి భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది.
నిజానికి సెప్టెంబర్ 10 నుంచి 14 మధ్య ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే.. భారత బృందంలో కరోనా కేసులు వెలుగు చూడడంతో ఆటగాళ్లు మైదానంలోకి దిగేందుకు నిరాకరించారు. అప్పట్లో రీషెడ్యూల్‌కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ప్రయత్నించినప్పటికి సందిగ్థత వీడలేదు. తాజాగా ఈ మ్యాచ్‌ను రీ షెడ్యూల్ చేస్తున్నట్లు రెండు దేశాల క్రికెట్ బోర్డులు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. వచ్చే ఏడాది జులైలో భారత జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ కోసం ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్ మూడు టీ20లు (జులై 7, 9, 10), మూడు వన్డేలు(జులై 12, 14, 17) ఆడనుంది. ఇక రద్దు అయిన ఐదో టెస్టు జులై 1 నుంచి 5వ తేదీ వరకు ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరగనుంది.