అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య(ఏఐఎఫ్‌ఎఫ్) కు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ఊహించని షాక్ ఇచ్చింది. ఏఐఎఫ్‌ఎఫ్ పై మంగళవారం సస్పెన్షన్ వేటు వేసింది. ఏఐఎఫ్‌ఎఫ్‌లో బయటి వ్యక్తుల (థర్డ్ పార్టీ) ప్రమేయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. తక్షణమే తమ నిర్ణయం అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయంపై ఫిఫా కౌన్సిల్ బ్యూరో ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపింది.
దీంతో భారత్‌లో అక్టోబర్ 11 నుంచి 30 వరకు జరగనున్న అండర్-17 మహిళల ప్రపంచ కప్ నిర్వహణపై అనిశ్చితి ఏర్పడింది. ఈ టోర్నీ కూడా ముందుగా అనుకున్నట్లు జరగదని తెలిపింది. అవసరం అయితే తదుపరి చర్యల కోసం తగిన సమయంలో ఫిఫా బ్యూరో ఆఫ్ కౌన్సిల్‌కు రిఫర్ చేస్తామని తెలిపింది. దీంతో ఈ టోర్నీ భారత్ నుంచి తరలివెళ్లే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది.
కాగా.. దీనిపై భారత యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖతో చర్చలు జరుపుతున్నామని, సానుకూల ఫలితాలు వెలువడ వచ్చుననే ఆశాభావాన్ని ఫిఫా వ్యక్తం చేసింది.