మైదానంలోకి దూసుకువ‌చ్చిన రోహిత్ ఫ్యాన్‌.. వీడియో వైర‌ల్

Fan breaches security, tries to touch Rohit Sharma's feet.భార‌త్‌లో క్రికెట్ అంటే ఓ ఆట కాదు. అది ఓ మ‌తం. క్రికెట‌ర్ల‌ను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Nov 2021 7:30 AM GMT
మైదానంలోకి దూసుకువ‌చ్చిన రోహిత్ ఫ్యాన్‌.. వీడియో వైర‌ల్

భార‌త్‌లో క్రికెట్ అంటే ఓ ఆట కాదు. అది ఓ మ‌తం. క్రికెట‌ర్ల‌ను దేవుళ్లుగా ఆరాధిస్తారు. మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండ్కూల‌ర్‌ను గాడ్ ఆఫ్ క్రికెట్‌గా(క్రికెట్‌కి దేవుడిగా) అభివ‌ర్ణిస్తుంటారు. త‌మ అభిమాన ఆట‌గాళ్లు పోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డుతుంటే.. మైదానంలో అభిమానులు పూన‌కాల‌తో ఊగిపోతుంటారు. ఆట‌గాళ్ల‌ను ద‌గ్గ‌రి నుంచి చూసేందుకు, వారితో క‌ర‌చాల‌నం చేసేందుకు.. ఒక్కొసారి మైదానంలోని సెక్యూరిటీ క‌ళ్ల‌ను క‌ప్పి కొంద‌రు అభిమానులు మైదానంలోకి వచ్చిన ఘ‌ట‌న‌లు మ‌నం చూశాం. స‌చిన్‌, ధోనికి అభిమానులు పాదాభివంద‌నం చేయ‌గా.. తాజాగా ఇలాంటి ఘ‌ట‌న‌నే భార‌త్‌, న్యూజిలాండ్ రెండో టీ20 మ్యాచ్ సంద‌ర్భంగా చోటు చేసుకుంది.

రాంచీ వేదిక‌గా శుక్ర‌వారం రాత్రి రెండో టీ20లో భార‌త్‌, న్యూజిలాండ్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. కివీస్ బ్యాటింగ్ చేస్తున్న క్ర‌మంలో ఓ అనూహ్య ఘ‌ట‌న చోటుచేసుకుంది. మిడాన్‌లో హిట్‌మ్యాన్‌, టీ20 కెప్టెన్ రోహిత్ ఫీల్డింగ్ చేస్తుండ‌గా.. ఓ అభిమాని సెక్యూరిటీ క‌ళ్లు క‌ప్పి మైదానంలోకి వ‌చ్చాడు. త‌న ఆరాధ్య క్రికెట‌ర్ రోహిత్ వ‌ద్ద‌కు వ‌చ్చిన అత‌డు హిట్‌మ్యాన్‌ ముందు ఎల్లకిలా పడుకుని రెండు చేతులు జోడించి సాష్టాంగ నమస్కారం చేశాడు. అయితే తనకు రోహిత్ శర్మ పాదాలు అందలేదు. వెంట‌నే రోహిత్ త‌న పాదాలు తాకొద్దంటూ ఆ అభిమానిని వారించే ప్ర‌య‌త్నం చేశాడు. అప్ర‌మ‌త్తమైన పోలీసులు స‌ద‌రు అభిమానిని మైదానం వెలుప‌లికి తీసుకువ‌చ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే భార‌త జ‌ట్టు 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. మార్టిన్‌ గప్టిల్‌ (15 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఫిలిప్స్‌ (34) , మిచెల్‌ (31) లు రాణించారు. అనంత‌రం ఓపెన‌ర్లు కేఎల్ రాహుల్‌ (49 బంతుల్లో 65; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్‌ శర్మ (36 బంతుల్లో 55; ఒక ఫోర్‌, 5 సిక్సర్లు) లు దంచికొట్ట‌డంతో టీమ్ఇండియా 154 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 17.2 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి చేదించింది. దీంతో మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే టీ20 సిరీస్‌ను భార‌త్ గెలుచుకుంది. ఇక చివ‌రి టీ20 మ్యాచ్ ఆదివారం కోల్‌క‌తాలో జ‌రుగుతుంది.

Next Story