క్వింట‌న్ నీకిది త‌గునా..? ఇదేం క్రీడాస్పూర్తి..? మోసం చేశావుగా..? వీడియో వైర‌ల్‌

Fake fielding by Quinton de Kock.తాజాగా పాకిస్థాన్‌, ద‌క్షిణాప్రికా జ‌ట్ల మ‌ధ్య రెండో వ‌న్డేలో పాక్ బ్యాట్స్‌మెన్ ఫ‌కార్ జ‌మాన్‌ను క్వింట‌న్ డికాక్ ర‌నౌట్ చేసిన విధానం ప్ర‌స్తుతం క్రికెట్ ప్ర‌పంచంలో పెద్ద చ‌ర్చ‌కే తావిచ్చింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 April 2021 5:34 AM GMT
feilding

క్రికెట్ అంటే జెంటిల్‌మ‌న్ గేమ్ అని అంటారు. ఈ జెంటిల్‌మ‌న్ గేమ్‌లో క్రీడాస్పూర్తి అనేది ఎంతో ముఖ్యం. క్రికెట్‌లో గెలుపు ఓట‌ములు స‌హ‌జం. కానీ.. ఎలా ఆడామ‌న్న‌దే ముఖ్యం. అయితే.. తాజాగా పాకిస్థాన్‌, ద‌క్షిణాప్రికా జ‌ట్ల మ‌ధ్య రెండో వ‌న్డేలో పాక్ బ్యాట్స్‌మెన్ ఫ‌కార్ జ‌మాన్‌ను క్వింట‌న్ డికాక్ ర‌నౌట్ చేసిన విధానం ప్ర‌స్తుతం క్రికెట్ ప్ర‌పంచంలో పెద్ద చ‌ర్చ‌కే తావిచ్చింది. ఇది క్రీడాస్పూర్తికి విరుద్దం అని అటు మాజీల‌తో పాటు ఇటు నెటీజ‌న్లు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

అస‌లేం జ‌రిగింది..?

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 341 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. క్వింట‌న్ డికాక్‌(80), కెప్టెన్ బ‌వుమా(92), వాండ‌న్ డ‌సెన్‌(60), మిల్ల‌ర్‌(50) అర్థ‌శ‌త‌కాల‌తో రాణించారు. అనంత‌రం 342 ప‌రుగుల భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బ‌రిలోకి దిగిన పాక్ జ‌ట్టు 120 ప‌రుగుల‌కే ఐదు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఓ వైపు ఫ‌కార్ జ‌మాన్ (193) ఒంటరి పోరాడం చేస్తుండ‌గా.. మ‌రోవైపు అత‌డికి స‌హ‌క‌రించే బ్యాట్స్‌మెన్లే క‌రువ‌య్యారు. ఇక చివ‌రి ఓవ‌ర్‌లో 31 ప‌రుగులు చేస్తే పాక్‌ను విజ‌యం వ‌రిస్తుంది. అప్ప‌టికే 192 ప‌రుగులు చేసి మంచి ఊపుమీదున్నాడు ఫ‌కార్. జ‌ట్టును గెలిపించ‌లేక‌పోయానా.. క‌నీసం అత‌డు డ‌బుల్ సెంచ‌రీ చేస్తాడ‌ని అంతా భావించారు.

అయితే.. ఎంగిడి వేసిన తొలి బంతికి డ‌బుల్ ర‌న్ తీయ‌బోయిన జ‌మాన్ రెండో ప‌రుగు పూర్తి చేసే స‌మ‌యంలో ర‌నౌట‌య్యాడు. ఫీల్డ‌ర్ మార్‌క్ర‌మ్ డైరెక్ట్ త్రో విస‌ర‌డంతో పెవిలియ‌న్ చేరాడు. అయితే.. ఇక్కడే డికాక్ తొండాట ఆడాడు. బంతి త‌న‌వైపే వ‌స్తున్నా.. ఫ‌కర్ జ‌మాన్ త‌న‌ను చూస్తున్న స‌మ‌యంలో నాన్‌స్ట్రైకింగ్‌లో బంతి అందుకోవాల్సిందిగా డీకాక్ సైగ చేశాడు. బంతి ఎలాగూ నాన్‌స్ట్రైకింగ్‌లోకి వెళ్తుంది క‌దా అని ఫ‌క‌ర్ కాస్త మెల్ల‌గా క్రీజును చేరుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ఇంత‌లోపే త్రో నేరుగా వ‌చ్చి స్టంప్స్‌ను తాకింది. ఫ‌క‌ర్ క్రీజుకు చాలా దూరంలో ఉండిపోయాడు. అప్ప‌టికే 193 ప‌రుగులు చేసి అల‌సిపోయిన ఫ‌క‌ర్‌.. నెమ్మ‌దిగా ప‌రుగు పూర్తి చేయాల‌నుకోవ‌డం కొంప ముంచింది.

అయితే ఫ‌క‌ర్ అవుట‌వ‌గానే డీకాక్ అత‌న్ని చూసి న‌వ్వాడు. పైగా రీప్లేల్లోనూ డీకాక్ కావాల‌నే ఫ‌క‌ర్‌ను త‌ప్పుదోవ ప‌ట్టించ‌డానికి ఇలా చేసిన‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపించింది. ఐసీసీ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఫీల్డింగ్‌లో మోసం చేసి బ్యాట్స్‌మ‌న్‌ను అవుట్ చేయ‌డం నేరం. కానీ ఫ‌క‌ర్ విష‌యంలో అంపైర్లు ఎలాంటి అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌క‌పోవ‌డంతో అత‌డు పెవిలియ‌న్ చేరాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీన్ని పాక్ అభిమానులుతో పాటు మాజీ క్రికెటర్లు త‌ప్పుబ‌ట్టారు.


Next Story