బాబర్ అజామ్‌ను కనీసం నేపాల్ టీమ్‌లోకి కూడా తీసుకోరు: షోయబ్ మాలిక్

T20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ ప్రదర్శన, పాకిస్తాన్ జట్టు ఆడిన తీరుపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ తీవ్ర విమర్శలు చేశాడు

By Medi Samrat  Published on  2 July 2024 8:15 PM IST
బాబర్ అజామ్‌ను కనీసం నేపాల్ టీమ్‌లోకి కూడా తీసుకోరు: షోయబ్ మాలిక్

T20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ ప్రదర్శన, పాకిస్తాన్ జట్టు ఆడిన తీరుపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ తీవ్ర విమర్శలు చేశాడు. 'పాకిస్థాన్ అత్యుత్తమ ఆటగాడు' బాబర్ అజామ్ కు ఏమాత్రం టీ20 ఫార్మాట్ కు సరిపోడని విమర్శలు గుప్పించాడు. ఏ అంతర్జాతీయ జట్టులో కూడా అతడికి చోటు దక్కదని షోయబ్ చెప్పాడు. చివరికి నేపాల్ జట్టు కూడా అతనిని తమ జట్టులోకి తీసుకోదని అన్నాడు షోయబ్ మాలిక్.

బాబర్ నేతృత్వంలోని పాక్ జట్టు టోర్నమెంట్‌లో సూపర్ 8 దశకు కూడా చేరుకోవడంలో విఫలమైంది. 2007లో టోర్నీ మొదలైన తర్వాత పాకిస్థాన్ ఇంత తొందరగా నిష్క్రమించడం ఇదే తొలిసారి. బాబర్ తన కెప్టెన్సీ, అలాగే బ్యాటింగ్‌లో కూడా ఘోరంగా విఫలమయ్యాడు. కెప్టెన్‌గా తిరిగి నియమించినా.. అతను జట్టుకు సరైన ఫలితాలను అందించలేకపోయాడు. యుఎస్‌ఎ చేతిలో కూడా పాకిస్థాన్ ఓడిపోయింది. సూపర్‌ ఓవర్‌లో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో పాకిస్థాన్‌ అమెరికా చేతిలో ఓడిపోయింది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో తమ చిరకాల ప్రత్యర్థి భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో పాక్ ఓటమి పాలైంది. భారతదేశం, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి అగ్రశ్రేణి అంతర్జాతీయ జట్లలో బాబర్ కు కనీసం స్థానం దక్కదని షోయబ్ మాలిక్ వ్యాఖ్యలు చేసిన వీడియో బయటపడింది. షోయబ్ మాలిక్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ జట్టులో ఉత్తమ ఆటగాడు ఎవరు? మా అత్యుత్తమ ఆటగాడు బాబర్ ఆజం. నేను కేవలం టాప్ 4-5 జట్ల గురించి మాట్లాడుతున్నాను. ఆ జట్లలో ప్లేయింగ్ XIలో బాబర్ సరిపోతాడా? ఆస్ట్రేలియా, భారతదేశం లేదా ఇంగ్లాండ్‌ జట్టులోకి బాబర్ ఆజమ్ వెళ్లగలిగే సత్తా ఉందా? అని అన్నాడు. తాను కేవలం టీ20 ఫార్మాట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నానని షోయబ్ మాలిక్ వెల్లడించాడు.

Next Story