ఓవల్ థ్రిల్లర్.. 90 ఓవర్లు.. 291 పరుగులు.. 10 వికెట్లు
England need another 291 runs to win.ఇప్పుడు అందరి చూపు ఓవల్ వైపే. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు
By తోట వంశీ కుమార్ Published on 6 Sept 2021 2:41 PM ISTఇప్పుడు అందరి చూపు ఓవల్ వైపే. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు మంచి రసకందాయంలో పడింది. చివరి రోజు ఆట మిగిలి ఉండగా.. ఇరు జట్లను విజయం ఊరిస్తోంది. ఐదో రోజు 90 ఓవర్లలో 291 పరుగులు చేస్తే ఇంగ్లండ్ ను విజయం వరించనుండగా.. 10 వికెట్లు తీస్తే భారత్ గెలుస్తుంది. రోజు రోజుకు భిన్నంగా ప్రవర్తిస్తున్న పిచ్.. ఐదో రోజు ఎలా ప్రవర్తిస్తుంది అన్న దానిపైనే అందరి దృష్టి నెలకొంది. తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే కుప్పకూలిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 466 పరుగులతో ప్రత్యర్థిని శాసించే స్థితిలోకి వచ్చింది.
ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు ఆటముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది. దీంతో విజయం పై ఇరు జట్లు ధీమాగా ఉన్నాయి. ప్రస్తుతానికైతే.. పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఐదో రోజు తొలి సెషన్ లోని తొలి గంట ఆట కీలకం కానుంది. ఈ సమయంలో భారత బౌలర్లు వీలైనన్ని ఎక్కువ వికెట్లు పడగొట్టి మ్యాచ్‌లో పైచేయి సాధిస్తేనే.. గెలుపుపై ఆశలు ఉండేది.
సాధారణంగా టెస్టుల్లో ఐదో రోజు 250 పై చిలుకు పరుగులు సాధించడం చాలా కష్టం. అయితే.. ప్రస్తుతం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండడంతో ఇదేమి పెద్ద విషయం కాదంటున్నారు క్రీడాపండితులు. భారత్ గెలవచ్చు.. ఇంగ్లండ్ అద్బుతం చేయొచ్చు.. డ్రా అయ్యే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఏదీ ఏమైనప్పటికి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం విజయం కోసం పోరాడుతాడు అన్న దానిలో సందేహాం లేదు. అలాగే.. ఇంగ్లండ్ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. ఆ జట్టులో ఒంటి చేత్తో మ్యాచ్ తిప్పే ఆటగాళ్లు డేవిన్ మలాన్, జానీ బెయిర్ స్టో, వోక్స్, అలీ వంటి ఆటగాళ్లు ఉండడంతో ఇంగ్లండ్ లక్ష్యాన్ని చేదించినా పెద్దగా ఆశ్చర్యం లేదంటున్నారు.
Cricket at its best..Nothing can beat a well fought test series..The one in Australia and now this one ..The most skilfull form of cricket ..@BCCI
— Sourav Ganguly (@SGanguly99) September 5, 2021
@ICC
దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. క్రికెట్ అత్యుత్తమ దశలో కొనసాగుతున్నట్లు గంగూలీ ట్వీట్ చేశాడు. హోరాహోరీగా సాగుతున్న టెస్ట్ సిరీస్‌ను ఎవరూ కొట్టిపారేయలేరన్నారు. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్ అయినా, ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్ అయినా, అత్యుత్తమ ఆటకు నిదర్శనంగా నిలుస్తున్నాయని, ఈ రెండు సిరీస్‌ల్లోనూ టెస్ట్ క్రికెట్ నైపుణ్యం బయటపడినట్లు గంగూలీ ట్వీట్ చేశాడు.