తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 365 ఆలౌట్.. 160 పరుగుల కీలక ఆధిక్యం
England bowl India out for 365. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 365 పరుగులకు ఆలౌట్ అయింది.
By తోట వంశీ కుమార్
ఆల్ రౌండర్లు వాషిగ్టన్ సుందర్(96 నాటౌట్; 118 బంతుల్లో 13 పోర్లు, 2 సిక్సర్లు) అక్షర్ పటేల్ (43; 97 బంతుల్లో 5 పోర్లు, 1 సిక్స్) లు రాణించడంతో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 365 పరుగులకు ఆలౌట్ అయింది. సుందర్ తృటిలో శతకాన్ని కోల్పోయాడు. అక్షర్ పటేల్ ఔట్ కాగానే.. ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్ లు ఓకే ఓవర్‌లో ఔట్ కావడంతో సుందర్ శతక మైలురాయిని చేరుకోలేకపోయాడు. ప్రస్తుతం టీమ్ఇండియా 160 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
294/7 స్కోర్‌తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ మరో 71 పరుగులు జోడించి మిగతా మూడు వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్లు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ లు ఇంగ్లాండ్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. ఇద్దరూ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు 106 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఓ వైపు సుందర్ శతకానికి నాలుగు పరుగుల దూరంలో ఉండగా.. అక్షర్ కూడా అర్థశతకానికి చేరవయ్యాడు. ఈ దశలో అక్షర్ పటేల్ రనౌట్ అయ్యాడు.
రూట్ వేసిన 113వ ఓవర్ చివరి బంతిని సుందర్ షాట్ ఆడగా.. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న అక్షర్ పరుగు తీసేందుకు ప్రయత్నించగా.. సుందర్ నో చెప్పాడు. దీంతో అక్షర్ తిరిగి క్రీజును చేరేలోపు బెయిర్ స్టో బంతిని అందుకుని రూట్‌కు అందించగా.. రూట్ బెయిల్స్‌ను పడగొట్టాడు. దీంతో టీమ్ఇండియా 365 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ఆ తరువాతి ఓవర్ వేసిన స్టోక్స్ ఇషాంత్, సిరాజ్‌లను బంతుల వ్యవధిలో పెవిలియన్ చేర్చడంతో భారత ఇన్నింగ్స్‌కు ముగిసింది. దీంతో సుందర్ శతకాన్ని అందుకోలేకపోయాడు. శుక్రవారం రిషబ్‌పంత్ శతకం(101) సాధించిన సంగతి తెలిసిందే.