ఇంగ్లాండ్ రికార్డు ఛేదన.. భారత్‌కు తప్పని నిరాశ.. సిరీస్ సమం
England beats India by seven wickets to level series 2-2.భారత్‌తో జరిగిన ఐదో టెస్టులో ఇంగ్లాండ్ భారీ లక్ష్యాన్ని
By తోట వంశీ కుమార్ Published on 6 July 2022 8:18 AM ISTబర్మింగ్‌హామ్: భారత్‌తో జరిగిన ఐదో టెస్టులో ఇంగ్లాండ్ భారీ లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించింది. 378 పరుగుల లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి అందుకుంది. దీంతో సిరీస్‌ను 2-2తో సమయం చేసింది. ప్రత్యర్థి ఏదైనా సరే బాదుడే తమ లక్ష్యమని ఇంగ్లాండ్ కొత్త కెప్టెన్ బెన్‌స్టోక్స్ చెప్పినట్లుగానే ఇటీవల ఆ జట్టు ఎంతటి లక్ష్యాన్ని అయినా సునాయాసనంగా చేధిస్తోంది.
ఓవర్ నైట్ స్కోర్259/3 చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లాండ్ మరో వికెట్ కోల్పోకుండానే లక్ష్యాన్ని అందుకుంది. మాజీ కెప్టెన్ జో రూట్ (142 నాటౌట్; 173 బంతుల్లో 19 ఫోర్లు, 1 సిక్స్), జానీ బెయిర్‌స్టో (114 నాటౌట్; 145 బంతుల్లో15 ఫోర్లు, 1సిక్స్) శతకాలతో కదం తొక్కారు. ఎప్పుడూ సంప్రదాయక టెస్టు షాట్లను ఆడే రూట్ చివరి రోజు చాలా దూకుడుగా ఆడాడు. భారత పేసర్ శార్దూల్ బౌలింగ్‌లో రివర్స్ షాట్‌తో రూట్ సిక్సర్ కొట్టడం అందుకు నిదర్శనం. రూట్ టీ20లను తలపించేలా షాట్లు ఆడడం చర్చనీయాంశంగా మారింది. భారత్ తరుపున బుమ్రా,ఇంగ్లాండ్ తరుపున రూట్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' అవార్డులు అందుకున్నారు.
ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు గతేడాది ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన టీమ్‌ఇండియా నాలుగు మ్యాచ్‌లు ముగిసేసరికి 2-1తో ఆధిక్యంలో నిలిచింది. జట్టులో కరోనా కలకలం రేగడంతో పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుంది. మిగిలిన చివరి టెస్టును తాజాగా నిర్వహించగా కనీసం 'డ్రా'చేసుకున్నా సిరీస్ చేజిక్కించుకునే సువర్ణ అవకాశం టీమ్‌ఇండియా ముందున్నా మనవాళ్లకు నిరాశ తప్పలేదు. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించగా తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 416 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో284 రన్స్‌కు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 245 పరుగులు చేసి ప్రత్యర్థి ముందు 378 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. ఇంగ్లిష్ జట్టు మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేదించింది
ఇక టెస్టు సమరం ముగియగా.. గురువారం నుంచి ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.