చితక్కొట్టిన బట్లర్.. వరుసగా నాలుగో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం
England beat Sri lanka by 26 runs in T20 World Cup 2021.టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ అదరగొడుతోంది. వరుసగా నాలుగో
By తోట వంశీ కుమార్ Published on 2 Nov 2021 11:44 AM ISTటీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ అదరగొడుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఘన విజయం సాధించి సెమీస్‌కు మరింత చేరువైంది. ఓపెనర్ జోస్ బట్లర్ (67 బంతుల్లో 101 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) అజేయ శతకంతో చెలరేగి ఆడగా.. శ్రీలంకపై ఇంగ్లాండ్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. బట్లర్‌తో పాటు ఇయాన్ మోర్గాన్ (40; ఓ ఫోర్, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. అనంతరం 164 పరుగుల లక్ష్య చేధనలో లంక నిర్ణీత 20 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. లంక బ్యాట్స్‌మెన్లలో హసరంగ (34) ఫర్వాలేదనించగా.. మిగిలిన వారు విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మొయిన్ అలీ, అదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్ రెండేసి వికెట్లు తీయగా.. క్రిస్ వోక్స్, లియామ్ లివింగ్‌స్టోన్ తలో వికెట్ పడగొట్టారు.
164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ పతుమ్ నిశాంక (1) రనౌటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన చరిత్ అసలంక (21; 16 బంతుల్లో 3పోర్లు, ఒక సిక్స్) వేగంగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే రషీద్ వేసిన నాలుగో ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించిన మొయిన్ అలీకి చిక్కి పెవిలియన్ చేరాడు. అనంతరం ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో శ్రీలంక పవర్ ప్లే ముగిసే సమాయానికి 3 వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది. అవిష్క ఫెర్నాండో (13), బనుక రాజపక్స(26) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. క్రిస్ జోర్డాన్ తొమ్మిదో ఓవర్‌లో ఫెర్నాండోను ఔట్ చేసి ఈ జోడిని విడదీశాడు. అనంతరం కొద్దిసేపటికే రాజపక్స కూడా పెవిలియన్ చేరుకున్నాడు. అయితే.. కెప్టెన్ దసున్ శనక (26), వానిందు హసరంగ (34) దూకుడుగా ఆడుతూ జట్టును విజయం వైపు నడిపించారు. ఈ క్రమంలో హసరంగ ఔట్ కావడం, శనక రనౌట్ కావడంతో శ్రీలంక ఓటమి పాలైంది.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్ (101) శతక్కొట్టాగా.. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (40) రాణించాడు. జాసన్ రాయ్(9), డేవిడ్ మలన్(6), జానీ బెయిర్ స్టో(0) విఫలమయ్యారు. లంక బౌలర్లలో హసరంగ మూడు, దుష్మంత చమీర ఓ వికెట్ పడగొట్టారు.