చెన్నైలోని చెపాక్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 578 పరుగులకు ఆలౌట్ అయింది. అండర్సన్(1)ను అశ్విన్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. పర్యాటక జట్టును ఆలౌట్ చేయడానికి 190.1ఓవర్లు తీసుకుంది టీమ్ఇండియా. భారత బౌలర్లలో అశ్విన్, బుమ్రా చెరో మూడు వికెట్లు తీయగా.. నదీమ్, ఇషాంత్ శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
ఓవర్‌నైట్ స్కోర్ 555/8తో మూడో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లాండ్ మరో 23 పరుగులు జోడించి చివరి రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత బుమ్రా.. బెస్(34)ను ఎల్బీగా పెవిలియన్ చేర్చగా.. అనంతరం వచ్చిన అండర్సన్‌ను అశ్విన్ ఔట్ చేశాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ జో రూట్ 218, స్టోక్స్ 82, సిబ్లీ 87, బర్న్స్ 33, పోప్ 34, బట్లర్ 30 పరుగులతో రాణించారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్ 19 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. జోఫ్రా అర్చర్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్(13), పుజారా (0) పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమ్ఇండియా ఫాలో ఆన్ ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే 378 పరుగులు చేయాలి.