తుస్సుమ‌న్న టాప్ ఆర్డ‌ర్‌.. నిల‌బ‌డ‌ని మిడిలార్డ‌ర్‌.. ప్ర‌తిఘ‌టించ‌ని లోయ‌ర్ ఆర్డ‌ర్‌

England 120/0 at stumps lead by 42 runs.వారం రోజుల వ్య‌వ‌ధిలో ఎంత తేడా.. మొన్న అద్భుతం విజ‌యం సాధించిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Aug 2021 8:47 AM IST
తుస్సుమ‌న్న టాప్ ఆర్డ‌ర్‌.. నిల‌బ‌డ‌ని మిడిలార్డ‌ర్‌.. ప్ర‌తిఘ‌టించ‌ని లోయ‌ర్ ఆర్డ‌ర్‌

వారం రోజుల వ్య‌వ‌ధిలో ఎంత తేడా.. మొన్న అద్భుతం విజ‌యం సాధించిన జ‌ట్టు ఇదేనా అన్న సందేహం క‌లిగిస్తూ.. లీడ్స్‌లో టీమ్ఇండియా అత్యంత పేల‌వంగా ఆరంభించింది. బ్యాట్స్‌మెన్లు దారుణంగా విఫ‌ల‌మైన వేళ టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 78 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఇంగ్లాండ్ పేస‌ర్ల‌ను ఎదుర్కొన‌లేక వ‌చ్చిన బ్యాట్స్‌మెన్లు వ‌చ్చిన‌ట్లే పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. క‌నీసం క్రీజులో కుదురుకునేందుకు కూడా య‌త్నించ‌లేదు. 105 బంతులు ఆడి హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ చేసిన 19 ప‌రుగులే టాప్ స్కోర్‌. రోహిత్ తో పాటు టెస్టు వైస్ కెప్టెన్ ర‌హానే (18) మాత్ర‌మే రెండు అంకెల స్కోరు అందుకున్నాడు. ఆ త‌రువాత ఎక్స్‌ట్రాలే(16) అత్య‌ధికం కావ‌డం గ‌మ‌నార్హం.

టాస్ గెల‌వ‌డంతో మ‌రో ఆలోచ‌న లేకుండా కెప్టెన్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆ నిర్ణ‌యం త‌ప్పుడు నిర్ణ‌యం అని తెలియడానికి ఎంతో సేపు ప‌ట్ట‌లేదు. రెండో టెస్టులో ఘోర ఓట‌మితో ర‌గిలి పోతున్న ఇంగ్లాండ్ జ‌ట్టు పేస‌ర్లు.. ప‌రిస్థితుల‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకున్నారు. తొలి ఓవ‌ర్‌లో కేఎల్ రాహుల్ (0) అండ‌ర్స‌న్ బౌలింగ్‌లో ఔట్ కావ‌డంతో మొద‌లైన వికెట్ల ప‌త‌నం ఎక్క‌డా ఆగ‌లేదు. అండర్సన్‌(3/6), ఒవర్టన్‌ (3/14), రాబిన్సన్‌ (2/16), కరాన్‌ (2/27) భార‌త బ్యాట్స్‌మెన్ల‌కు చుక్కలు చూపించారు. పుజారా(1), కోహ్లీ(7) ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయారు. ఓ వైపు వికెట్లు ప‌డుతున్నా.. మ‌రో వైపు హిట్‌మ్యాన్ ఉండ‌డంతో అత‌డు కాపాడుతాడు ఏమో అన్న ఆశ ఉండేది. ర‌హానే-రోహిత్‌ల జోడి 15 ఓవ‌ర్ల పాటు వికెట్ల ప‌త‌నాన్ని అడ్డుకున్నారు. అయితే.. లంచ్‌కు ముందు ర‌హానే ఔట్ కావ‌డంతో భార‌త్ కు క‌ష్టాలు త‌ప్ప‌లేదు.

లంచ్ త‌రువాత వికెట్ల ప‌త‌నం వేగంగా సాగింది. పంత్‌(2) మ‌రోసారి నిర్ల‌క్ష్యంగా వికెట్ పారేసుకోగా.. జ‌డేజా(4) కూడా ఆదుకోలేదు. ఆరు బంతుల వ్య‌వ‌ధిలో రోహిత్‌తో స‌హా నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టి ఇంగ్లాండ్ భార‌త్ ను గట్టిదెబ్బ తీసింది. అప్ప‌టి వ‌ర‌కూ ఎంతో స‌హ‌నంతో బ్యాటింగ్ చేసిన రోహిత్ శ‌ర్మ కూడా.. ఒవ‌ర్థ‌న్ వేసిన షార్ట్ పిచ్ బంతిని అంచ‌నా వేయ‌డంతో విఫ‌లం అయి పెవిలియ‌న్ చేరాడు. గ‌త మ్యాచ్‌లో అద్భుత బ్యాటింగ్ చేసిన ష‌మి(0), బుమ్రా(0)లు క‌నీసం ప‌రుగుల ఖాతా కూడా తెర‌వ‌కుండానే ఔట‌య్యారు. దీంతో టీమ్‌ఇండియా 40.4 ఓవర్లలో 78 పరుగులకే కుప్ప‌కూలింది.

భార‌త్ బ్యాట్స్‌మెన్లు ప‌రుగులు చేయ‌డానికి ఇబ్బంది ప‌డిన అదే పిచ్ పై ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లు అద‌ర‌గొట్టారు. ఓపెనర్లు హమీద్‌(60 నాటౌ ట్‌), బర్న్స్‌(52 నాటౌట్‌) అజేయ అర్ధసెంచరీలతో రాణించారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా ఇంగ్లాండ్ 120 పరుగులు చేసింది. ప్రస్తుతం 42 పరుగుల ఆధిక్యంలో కొన‌సాగుతోంది. భార‌త బౌల‌ర్లు ఒక్క వికెట్ కూడా ప‌డ‌గొట్ట‌లేక‌పోయారు. ఇక ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా పుంజుకోవాలంటే అద్బుతం జ‌ర‌గాల్సిందే.

Next Story