బౌలర్లపైనే భారమంతా.. ఓటమి దిశగా భారత్..!
Elgar keeps SA steady at Stumps.జొహానెస్‌బర్గ్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు
By తోట వంశీ కుమార్ Published on 6 Jan 2022 2:42 AM GMTజొహానెస్‌బర్గ్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా మారింది. సీనియర్ ఆటగాళ్లు పుజారా, రహనే లు రాణించడంతో భారత్ 240 పరుగుల లక్ష్యాన్ని నిర్థేశించగా.. దక్షిణాఫ్రికా దీటుగా ఆడుతోంది. చేతిలో 8 వికెట్లు ఉన్న సౌతాఫ్రికా మరో 122 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది. కెప్టెన్ డీన్ ఎల్గర్ (46 ), డసెన్ (11) క్రీజ్‌లో ఉన్నారు. అయితే.. బ్యాట్స్‌మెన్లను పరీక్షిస్తున్న పిచ్‌పై భారత విజయావకాశాలనూ కొట్టిపారేయలేం. నాలుగో రోజు ఫలితం తేలడం ఖాయంగా కనిపిస్తుంది.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 85/2తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌటైంది. తమ కెరీర్లు ప్రమాదంలో పడిన దశలో, మరోసారి విఫలమైతే జట్టులో చోటు కోల్పోయే అవకాశం ఉన్న స్థితిలో పుజారా, రహానే కీలక ఇన్నింగ్స్‌లతో సత్తా చాటారు. రహానే (78 బంతుల్లో 58; 8 ఫోర్లు, 1 సిక్స్), పుజారా (86 బంతుల్లో 53; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయగా.. హనుమ విహారి (84 బంతుల్లో 40 నాటౌట్; 6 ఫోర్లు) సత్తా చాటాడు. పంత్(0) మరోసారి విఫలం అయ్యాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ, ఎంగిడి, జాన్సన్ తలా మూడు వికెట్లు పడగొట్టారు.
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 202 కు ఆలౌట్ కాగా.. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 229 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 27 పరుగులు తీసివేయగా దక్షిణాప్రికా ముందు 240 పరుగుల లక్ష్యం నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు ఓపెనర్లు పట్టుదలతో బ్యాటింగ్ చేశారు. మార్క్‌రమ్ (38 బంతుల్లో 31; 6 ఫోర్లు) దూకుడుగా ఆడడంతో సౌతాఫ్రికా 10 ఓవర్లలోనే 47 పరుగులు చేసింది. అయితే.. తొలి ఇన్నింగ్స్ హీరో శార్దూల్ ఠాకూర్.. మార్క్‌రమ్‌ను బుట్టలో వేశాడు. ఆ తర్వాత వచ్చిన కీగన్ పీటర్సన్ (28; 4 ఫోర్లు) కూడా రాణించాడు. దీంతో ఓ దశలో సౌతాఫ్రికా జట్టు 93/1తో నిలిచింది. అయితే.. అశ్విన్ ఓ చక్కటి బంతితో పీటర్సన్‌ను ఎల్బీగా ఔట్ చేశాడు. ఈ దశలో ఎల్గర్, డసెన్ జోడి మరో వికెట్ పడనీయకుండా రోజును ముగించింది. నాలుగో రోజు బౌలర్ల రాణింపుపైనా భారత విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.