సిరాజ్ స్థానంలో ఆ ఇద్దరిలో ఎవరు..?
Dravid gives major update on Siraj's availability for 3rd Test.దక్షిణాఫ్రికాతో వాండరర్స్ వేదికగా జరిగిన రెండో
By తోట వంశీ కుమార్ Published on 9 Jan 2022 11:40 AM ISTదక్షిణాఫ్రికాతో వాండరర్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ గాయపడిన సంగతి తెలిసిందే. గాయం కారణంగా అతడు రెండు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 15.5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న అతడు సిరీస్‌లో నిర్ణయాత్మకమైన మూడో టెస్టుకు దాదాపు దూరమైనట్లే కనిపిస్తోంది. మూడో టెస్టుకు సిరాజ్ అందుబాటులో ఉంటాడో లేదో చెప్పలేమని హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్ చెప్పాడు. దీంతో సిరాజ్ దాదాపుగా ఆడే అవకాశం లేనట్లే.
అయితే.. ఇప్పుడు సిరాజ్ స్థానంలో ఎవరిని తీసుకోవాలన్నదే టీమ్‌మేనేజ్‌మెంట్ ముందున్న ప్రశ్న. వంద టెస్టులకు పైగా ఆడిన సీనియర్ ఆటగాడు ఇషాంత్ శర్మతో పాటు అద్భుత అవుట్ స్వింగర్లతో బ్యాట్స్‌మెన్లను బెంబేలెత్తించే ఉమేశ్ యాదవ్ ఈ స్థానం కోసం పోటీపడుతున్నారు. కాగా.. 33 ఏళ్ల ఇషాంత్ ఇటీవల కాలంలో పెద్దగా ఫామ్‌లో లేడు. ఇషాంత్ పోలిస్తే ఉమేశ్ యాదవ్ కాస్త మెరుగైన ఫామ్‌లో ఉన్నాడు. అయితే.. ఉమేశ్‌ను కాదని కెప్టెన్ కోహ్లీ, కోచ్ ద్రావిడ్‌లు ఇషాంత్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది.
ఆరు అడుగుల 3 అంగుళాల ఎత్తు కలిగిన ఈ ఢిల్లీ పేసర్ లెంగ్త్ బంతులు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లను ఇబ్బంది పెట్టవచ్చు. ఎందుకంటే ఆతిథ్య జట్టులో ఆరు అడుగులకు మించి ఎత్తు కలిగిన జాన్సెన్, ఒలివియెర్ రెండో టెస్టులో వికెట్ల పండుగ చేసుకున్నారు. వారి బౌలింగ్‌లో బంతి అనూహ్యంగా బౌన్స్ అయి బ్యాట్స్‌మెన్లు కుదురుకునేందుకు కష్టమయ్యింది. రెండో టెస్టులో భారత్ నుంచి పొడగరి పేసర్ లేకపోవడం నష్ట పరిచిందని మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డాడు. అందుకనే మూడో టెస్టుకు ఇషాంత్‌ను తీసుకోవాలని సూచిస్తున్నాడు.
ఇక మూడో టెస్ట్ వేదికైన న్యూలాండ్స్ స్టేడియం సముద్రం పక్కనే ఉండడంతో అధిక గాలులు వీస్తుంటాయని.. అప్పుడు బంతి గమనం మరింత ఎక్కువగా ఉంటుందని, ఇది ఇషాంత్‌లాంటి బౌలర్లకు లాభిసుందని మాజీ కీపర్ దీప్‌దాస్ గుప్తా అభిప్రాయపడ్డాడు. మరీ జట్టు మేనేజ్‌మెంట్ ఇషాంత్, ఉమేశ్ లలో ఎవరిని తీసుకుంటుందో చూడాలి. సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమానంగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకోనుంది.