సెంచరీ చేయకపోవడం బాధ కలిగించింది : శిఖర్ ధావన్
Disappointed not to score a century says Shikhar Dhawan.తొలి వన్డేలో తృటిలో శతకం చేజారడం బాధ కలిగించిందని
By తోట వంశీ కుమార్ Published on 23 July 2022 6:32 AM GMTతొలి వన్డేలో తృటిలో శతకం చేజారడం బాధ కలిగించిందని టీమ్ఇండియా తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్ అన్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. తాత్కాలిక కెప్టెన్, ఓపెనర్ శిఖర్ దావన్ సెంచరీకి చేరువైన వేళ అతడు మోటీ బౌలింగ్‌లో షాట్ కు యత్నంచి బ్రూక్స్ చేతికి చిక్కాడు. దీంతో సెంచరీకి మూడు పరుగుల దూరంలో పెవిలియన్ చేరాడు. మొత్తం 99 బంతులు ఎదుర్కొన్న శిఖర్ 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 97 పరుగులు చేశాడు.
ఇక ఈ విషయంపై మ్యాచ్ అనంతరం శిఖర్ ధావన్ మాట్లాడుతూ తాను సెంచరీ సాధించకపోవడం బాధను కలిగించిందని అన్నాడు. అయితే.. జట్టు బాగా ఆడిందని చెప్పుకొచ్చాడు. యువ ఆటగాళ్లు చక్కగా ఆడారని, దీంతో విండీస్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగామని తెలిపాడు. అయితే, ఆఖరి వరకు మ్యాచ్ ఇంత హోరాహోరీగా సాగుతుందని ఊహించలేదన్నాడు. ఆఖరి క్షణాల్లో ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా చాలా ప్రశాంతంగా ఉన్నట్లు చెప్పాడు. ఏదీ ఏమైనప్పటికీ తదుపరి మ్యాచుల్లో ఇంకా మెరుగ్గా రాణించాల్సి ఉందని శిఖర్ తెలిపాడు.
గెలిచామని అనుకున్నా..
టీమ్ఇండియా నిర్దేశించిన 309 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ దాదాపుగా చేదించినంత పని చేసింది. ఓపెనర్ కైలీ మేయర్స్ 75, బ్రూక్స్ 46, బ్రాండన్ కింగ్ 54 పరుగులతో రాణించగా.. ఆఖర్లో అకీల్ హొసేన్ 32, రొమారియో షెపర్డ్ 39 పరుగులతో అజేయంగా నిలిచి విజయం కోసం కడ వరకు పోరాటం చేశారు. అయినప్పటికీ మూడు పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది.
దీనిపై వెస్టిండీస్ కెప్టెన్ పూరన్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో తాము విజయం సాధించినట్లుగా అనిపించిందని చెప్పాడు. కేవలం 3 పరుగుల తేడాతో ఓటమి పాలు కావడాన్ని జీర్ణించుకోవడం కాస్త కష్టంగా ఉందన్నాడు. అయితే.. తాము అనుకున్నట్లుగా 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయడం సంతృప్తి ఇచ్చిందన్నాడు. మిగిలిన మ్యాచ్‌లలో సత్తా చాటుతామని చెప్పాడు. మా బ్యాటర్లు అద్బుతంగా ఆడారు. బౌలర్లు అంతే అద్భుతంగా ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను కట్టడి చేశారన్నాడు. మిగిలిన మ్యాచుల్లో విజయం సాధించేందుకు ఇంకా గట్టిగా ప్రయత్నిస్తామని తెలిపాడు.