అన్ని క్రికెట్ ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన దినేశ్ కార్తిక్
టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ సంచలన ప్రకటన చేశాడు.
By Srikanth Gundamalla Published on 2 Jun 2024 7:16 AM ISTఅన్ని క్రికెట్ ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన దినేశ్ కార్తిక్
టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ సంచలన ప్రకటన చేశాడు. అన్ని ఫార్మట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ మేరకు దినేశ్ కార్తిక్ శనివారం ప్రకటన చేశాడు. ఇటీవల 2024 సీజన్ తర్వాత దినేశ్ కార్తిక్ ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఇక తాజాగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి కూడా వైదొలుగుతున్నట్లు దినేశ్ కార్తిక్ చెప్పాడు.
దినేశ్ కార్తిక్ 39వ పుట్టిన రోజు సందర్భంగా దినేశ్ కార్తిక్ తన ఇన్‌స్టాలో ఉద్వేగపూరిత పోస్టు షేర్ చేశాడు. తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. గత కొంతకాలంగా తనకు లభిస్తున్న మద్దతు, తనపై కురిపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలతో తడిసి ముద్దవుతున్నట్లు చెప్పాడు. దీనంతటికి కారణమైన అభిమానులకు అతను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాడు. బాగా ఆలోచించిన తర్వాత తన రిప్రెజెంటెటివ్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు చెప్పాడు. అధికారికంగా తన రిటైర్మెంట్ ప్రకటించాడు దినేశ్ కార్తిక్.
ఇక తనకు ప్రయాణంలో సహకరించిన కోచ్‌లు, కెప్టెన్‌లు, సెలెక్టర్లు, సహచర ఆటగాళ్లు, సహాయ సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు చెప్పాడు. జాతీయ జట్టుకు ఆడటం అవకాశం దొరకడం తన అదృష్టమని చెప్పాడు. ఇక్కడి వరకు వచ్చానంటే తన తల్లిదండ్రులే కారణమని దినేశ్ చెప్పాడు. వారి ఆశీర్వాదాలు లేకుండా ఇవేవీ తానుసాధించలేనని అన్నాడు. దీపకకు కూడా చాలా రుణపడిపోయానని దినేశ్ కార్తిక్ పోస్టులో పేర్కొన్నాడు. తను స్వతహాగా ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్ అయినా.. తన కెరియర్ కొనసాగిస్తూనే అండగా నిలిచిందని చెప్పాడు. ఇక అందరి కంటే పెద్ద థ్యాంక్ తన అభిమానులకే అంటూ దినేశ్ కార్తిక్ పెద్ద నోట్ రాశాడు.
దినేశ్ కార్తిక్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా 2004లో ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఇంగ్లండ్‌తో వన్డే సరీస్ సందర్బంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. అదే ఏడాది ఆస్ట్రేలియాతో వాంఖడే వేదికగా టెస్టుల్లోకి వచ్చాడు. ఆ తర్వాత రెండేళ్లకు టీ20ల్లోకి కూడా వచ్చాడు. ఇక మొత్తం 180 ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన దినేశ్ కార్తిక్ 3,463 పరుగులు చేశాడు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాలో కూడా డీకే భాగంగా ఉన్నాడు.