భారత అగ్రశ్రేణి రెజ్లర్, ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ ముందస్తు బెయిల్ పిటిషన్ను దిల్లీలోని రోహిణి కోర్టు కొట్టేసింది. సాగర్ దంకడ్ అనే యువ రెజ్లర్ హత్య కేసులో అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. కేసు వివరాల్లోకి వెళితే ఇటీవల మే 4 వ తేదీన ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో సాగర్ ధంకడ్ అనే జూనియర్ రెజ్లర్ హత్య జరిగింది. ఈ హత్యలో సుశీల్ కుమార్ కూడా పాల్గొన్నాడని పోలీసులు గుర్తించారు. ధంకడ్ హత్య తర్వాత సుశీల్ కుమార్ పరారీలో ఉండడంతో అతడి పాత్రపై అనుమానాలు బలపడ్డాయి.
మృతుడు సాగర్, అతని స్నేహితులు నివసింస్తున్న ఇంటిని ఖాళీ చేయమని సుశీల్, అతని స్నేహితుడు అజయ్ ఒత్తిడి తెచ్చారు. విషయం సీరియస్ గా మారి రెజ్లర్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరితో ఒకరు గొడవ పడ్డారు. ఈ గొడవలో 5 గురు గాయపడ్డారు. వారిలో ఒకరైన సాగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
వారం రోజులుగా సుశీల్ కుమార్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నప్పటికీ ఫలితం లేకపోయింది. పోలీసులు ఎనిమిది బృందాలుగా వారం రోజుల్నుంచి అతడి కోసం గాలిస్తున్నారు. సుశీల్ పై ఇప్పటికే నాన్ బెయిలబుల్ వారెంట్, లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. సుశీల్ కుమార్ ఆచూకీ తెలిపిన వారికి లక్షరూపాయలు, మరో నిందితుడు అజయ్ ఆచూకీ తెలిపినవారికి 50 వేల రూపాయలు రివార్డ్ ఇస్తామని ప్రకటించారు ఢిల్లీ పోలీసులు. ఈ నేపథ్యంలో సుశీల్ కుమార్ ఢిల్లీలోని రోహిణి కోర్టును ఆశ్రయించాడు. ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.అయితే కోర్టు దానిని కొట్టేసింది.