తొలి మ్యాచ్ లో ఆర్సీబీకి ఘోర పరాభవం
Delhi Capitals Women won by 60 runs. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మొదటి మ్యాచ్ లో ఓటమిని మూటగట్టుకుంది.
By M.S.R
Royal Challengers Bangalore vs Delhi Capitals
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మొదటి మ్యాచ్ లో ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 60 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ముంబయిలోని బ్రాబోర్న్ స్టేడియం లో టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ టాపార్డర్ బ్యాటర్లు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 223 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ, కెప్టెన్ మెగ్ లానింగ్ తొలి వికెట్ కు 162 పరుగులు జోడించారు. షెఫాలీ 45 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేయగా, లానింగ్ 43 బంతుల్లో 14 ఫోర్లతో 72 పరుగులు చేసింది. లానింగ్, షెఫాలీ వర్మలను హీదర్ నైట్ ఒకే ఓవర్లో అవుట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన మరిజానే కాప్, జెమీమా రోడ్రిగ్స్ కూడా భారీ షాట్లు ఆడారు. కాప్ 17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 39 పరుగులు చేసింది. జెమీమా 15 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులే చేసింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ బౌలర్ నోరిస్.. నాలుగు ఓవర్లు విసిరి 29 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి ఆర్సీబీ పతనాన్ని శాసించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు స్మృతి మంధాన (23 బంతుల్లో 35, 5 ఫోర్లు, 1 సిక్స్), సోఫీ డెవైన్ (14) శుభారంభమే అందించారు. అయితే ఆ తర్వాత ఎవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. చివర్లో హీథర్ నైట్ 21 బంతుల్లో 2 ఫోర్లు, 2 భారీ సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేసింది.