కోహ్లీ ప్రార్థనలు ఫలించాయి.. ముంబై గెలిసింది.. బెంగళూరు మురిసింది
Mumbai Indians beat Delhi Capitals by 5 wickets.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సీజన్‌లో లీగ్ దశలో మరో మ్యాచ్
By తోట వంశీ కుమార్ Published on 22 May 2022 8:42 AM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సీజన్‌లో లీగ్ దశలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్ చేరే జట్లు ఖరారయ్యాయి. ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయం పాలైంది. శనివారం ముంబై చేతిలో 5 వికెట్ల తేడాతో ఢిల్లీ ఓటమి పాలైంది. పేలవ ఫీల్డింగ్‌కు తోడు కీలక సమయంలో రివ్యూలు తీసుకోవడంలో విఫలం కావడంతో చేజేతులా ఢిల్లీ ఓటమిని మూటగట్టుకుంది. ఇక ముంబై పోతూ పోతూ తమ వెంట ఢిల్లీని తీసుకువెళ్లింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఆ జట్టులో రావ్‌మన్ పావెల్ ( 43; 34 బంతుల్లో ఒక ఫోర్, 4 సిక్సర్లు), రిషబ్ పంత్ (39; 33 బంతుల్లో4 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించగా.. డేవిడ్ వార్నర్(5), మిచెల్ మార్ష్(0), సర్ఫరాజ్(10) విఫలం అయ్యారు. అనంతరం లక్ష్యాన్ని ముంబై 5 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో చేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (13 బంతుల్లో 2) తీవ్రంగా నిరాశ పరచగా.. ఇషాన్ కిషన్ (48; 35 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు), బ్రేవిస్ (37; 33 బంతుల్లో ఒక ఫోర్, 3 సిక్సర్లు) రాణించారు. ఆఖర్లో టిమ్ డేవిడ్ (34; 11 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) సిక్సర్లతో విరుచుపడడంతో ముంబై విజయాన్ని అందుకుంది.
ఇక ఈ మ్యాచ్‌లో పంత్ అన్నీ రకాలుగా నిరాశపరిచాడు. ఓ రకంగా జట్టు ఓటమికి అతడే కారణంగా నిలిచాడు. తొలుత బ్యాటింగ్‌లో కుదురుకున్న తరువాత వేగంగా ఆడి జట్టుకు భారీ స్కోర్ అందించాల్సిన తరుణంలో దూరంగా వెలుతున్న బంతిని వెంటాడి పెవిలియన్ చేరాడు. ఫీల్డింగ్‌లో కుల్‌దీప్ బౌలింగ్‌లో బ్రేవిస్ క్యాచ్‌ను వదిలేశాడు. గాల్లోకి లేచిన బంతిని గ్లౌజులున్నా ఒడిసిపట్టుకోలేకపోయాడు. అనంతరం టిమ్ డేవిడ్ విషయంలో సమీక్ష కోరలేదు. ఇది మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది. ఆడిన తొలి బంతికే డేవిడ్ బ్యాట్‌ను తాకుతూ బంతి పంత్ చేతిలో పడింది. అప్పీల్ చేయగా అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అయితే.. సర్ఫరాజ్ ఖాన్ వచ్చి పంత్ ను సమీక్ష కోరాల్సిందిగా ఒప్పించే ప్రయత్నం చేసినా.. అనుమానంతో పంత్ సమీక్ష కోరలేదు. అనంతరం డేవిడ్ 11 బంతుల్లో 34 పరుగులు చేసి ఢిల్లీకి మ్యాచ్‌ను దూరం చేశాడు.
సరిగ్గా నాలుగేళ్ల క్రితం 2018 సీజన్‌లో ముంబై ఫ్లే ఆఫ్స్ అవకాశాలను ఢిల్లీ దెబ్బతీయగా.. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్లే ఆఫ్స్ అవకాశాలను ముంబై గల్లంతు చేసి ప్రతీకారం తీర్చుకుంది. ఇక ముంబై గెలుపుతో ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన గుజరాత్, రాజస్థాన్ మంగళవారం జరుగనున్న తొలి క్వాలిఫయర్‌లో తలపడనుండగా.. బుధవారం ఎలిమినేటర్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) అమీతుమీ తేల్చుకోనున్నాయి.