గ‌త సీజ‌న్‌లో ఏమాత్రం రాణించ‌కున్నా ఆ స్టార్ బ్యాట్స్‌మెన్‌ను జ‌ట్టులోనే ఉంచిన ఢిల్లీ క్యాపిటల్స్.!

ఐపీఎల్‌-2024 కోసం ఆటగాళ్లను వదులుకోవ‌డానికైనా లేదా రిటైన్ చేసుకోవ‌డానికైనా ఈరోజే చివరి తేదీ.

By Medi Samrat  Published on  26 Nov 2023 5:28 PM IST
గ‌త సీజ‌న్‌లో ఏమాత్రం రాణించ‌కున్నా ఆ స్టార్ బ్యాట్స్‌మెన్‌ను జ‌ట్టులోనే ఉంచిన ఢిల్లీ క్యాపిటల్స్.!

ఐపీఎల్‌-2024 కోసం ఆటగాళ్లను వదులుకోవ‌డానికైనా లేదా రిటైన్ చేసుకోవ‌డానికైనా ఈరోజే చివరి తేదీ. దీంతో ఆటగాళ్లు పెద్ద ఎత్తున మారే అవ‌కాశం క‌న‌పిస్తుంది. ఈ ప‌రిస్థితుల‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ డాషింగ్‌ బ్యాట్స్‌మెన్, ఓపెన‌ర్‌ పృథ్వీ షాకు సంబంధించి తీసుకున్ననిర్ణయం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.

ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు చివరి రోజు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్ పృథ్వీ షాను జ‌ట్టులోనే ఉంచుకుంది. గత ఐపీఎల్ సీజన్ అతనికి ఏమాత్రం క‌లిసిరాలేదు. దీంతో ఢిల్లీ పృథ్వీని విడుదల చేస్తుందని ఊహాగానాలు వచ్చాయి. అయితే అది జ‌ర‌గ‌లేదు. గత ఐపీఎల్ సీజన్‌లో మొత్తం 8 మ్యాచ్‌లు ఆడిన పృథ్వీ.. కేవలం 106 పరుగులే చేశాడు. దీంతో ఈ సీజన్‌లో పృథ్వీని ఢిల్లీ వ‌దులుకుంటుంద‌ని అంతా భావించారు. కానీ ఢిల్లీ జ‌ట్టు యాజ‌మాన్యం తన నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఢిల్లీ క్యాపిటల్స్ పృథ్వీ షాను రూ. 8 కోట్లకు కొనుగోలు చేసింది. పృథ్వీ ఇప్పటివరకూ మొత్తం 71 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 1,694 పరుగులు చేశాడు. అత్య‌ధిక‌ స్కోరు 99 పరుగులు. గ‌ణాంకాలు చూస్తే పృథ్వీ స్టార్ ప్లేయర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే పృథ్వీని జట్టులోనే కొనసాగించాలని ఢిల్లీ నిర్ణయించింది.

ఈ ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ కెప్టెన్ కూడా మారనున్నాడు. గత సీజన్‌లో ఢిల్లీ శాశ్వత కెప్టెన్ రిషబ్ పంత్ ప్రమాదం కారణంగా ఆడలేకపోయాడు. అటువంటి పరిస్థితితుల‌లో డేవిడ్ వార్నర్‌కు ఢిల్లీ కెప్టెన్సీ అప్పగించారు. అయితే ఈసారి రిషబ్ పంత్ పునరాగమనం చేయబోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీని డేవిడ్ వార్నర్ నుంచి రిషబ్ పంత్‌కు అప్పగించనున్నారు.

Next Story