ఢిల్లీ మురిసింది.. హైద‌రాబాద్‌కు వ‌రుస‌గా మూడో ఓట‌మి

Delhi Capitals beats Sunrisers Hyderabad by 21 runs in IPL 2022.ఫ్లే ఆఫ్ రేసులో నిల‌వాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 May 2022 9:04 AM IST
ఢిల్లీ మురిసింది.. హైద‌రాబాద్‌కు వ‌రుస‌గా మూడో ఓట‌మి

ఫ్లే ఆఫ్ రేసులో నిల‌వాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ అద‌ర‌గొట్టింది. బ్యాటింగ్‌లో వార్న‌ర్‌, పావెల్ లు అర్థ‌శ‌త‌కాల‌తో రాణించ‌గా.. బౌల‌ర్లు స‌మిష్టిగా స‌త్తా చాట‌డంతో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌పై 21 తేడాతో విజయం సాధించింది. దీంతో ప‌ది మ్యాచుల్లో 5 విజ‌యాలు సాధించిన ఢిల్లీ ప‌ది పాయింట్ల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో ఐదోస్థానానికి ఎగ‌బాకింది. హైదరాబాద్‌ హ్యాట్రిక్‌ ఓటమితో ఆరో స్థానంలో నిలిచింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్ల న‌ష్టానికి 207 ప‌రుగులు చేసింది. డేవిడ్ వార్నర్‌(92 నాటౌట్‌; 58 బంతుల్లో12 ఫోర్లు, 3 సిక్స్‌లు), రోవ్‌మన్‌ పావెల్‌(67 నాటౌట్‌, 35 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) అజేయ అర్ధసెంచరీలతో జ‌ట్టుకు భారీ స్కోర్ అందించారు. పరుగుల ఖాతా తెరువకుండానే ఓపెనర్‌ మణ్‌దీప్‌సింగ్‌(0) వికెట్‌ను ఢిల్లీ కోల్పోయింది. వన్‌డౌన్‌లో వచ్చిన మిచెల్‌ మార్ష్‌(10) విఫ‌లం కాగా.. కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌(26) ఆదుకోలేక‌పోయాడు. దీంతో 85 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన ఢిల్లీని వార్నర్‌, పావెల్‌ ఆదుకున్నారు. వార్న‌ర్ బాధ్య‌తాయుత బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను త‌న భుజాల‌పై మోస్తే.. పావెల్ మెరుపు ముగింపునిచ్చాడు. ఒక్క భువ‌నేశ్వ‌ర్ కుమార్ త‌ప్ప ఏ హైద‌రాబాద్ బౌల‌ర్ బ్యాట్స్‌మెన్ల‌ను కట్ట‌డి చేయ‌లేక‌పోయారు.

అనంత‌రం భారీ ల‌క్ష్య చేద‌న‌లో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 186/8 స్కోరుకు పరిమితమైంది. నికోలస్‌ పూరన్‌( 62, 34 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లు), మక్రామ్‌( 42, 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) పోరాడినా.. మిగ‌తా బ్యాట‌ర్లు విఫ‌లం కావ‌డంతో ఓట‌మి త‌ప్ప‌లేదు. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ(7), కెప్టెన్‌ విలియమ్సన్‌(4) తీవ్రంగా నిరాశరిచారు. రాహుల్‌ త్రిపాఠి(22) నిలదొక్కుకోలేకపోయాడు. దీంతో హైద‌రాబాద్ 9 ఓవ‌ర్ల‌లో 48 ప‌రుగుల‌కే 3 కోల్పోయి బాగా వెన‌క‌బ‌డి పోయింది.

అయితే.. పూరన్‌, మక్రామ్‌ ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఢిల్లీ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో రైజర్స్‌ కోలుకోలేకపోయింది. ఆఖర్లో పూరన్ సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డ్డాడు. అయితే.. 18 ఓవ‌ర్‌లో శార్దూల్ బౌలింగ్‌లో పూర‌న్ ఔట్ కావ‌డ‌తో హైదరాబాద్ ఓట‌మి ఖాయ‌మైంది. దీంతో హ్యాట్రిక్‌ ఓటములు ఖాతాలో వేసుకుంది హైద‌రాబాద్. అజేయ అర్ధసెంచరీతో రాణించిన వార్నర్‌కు 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' దక్కింది.

Next Story