అంపైర్ ను బూతులు తిట్టిన టీమ్ఇండియా క్రికెటర్
Deepak Hooda loses his cool and shouts at the umpire. తొలి టీ20లో భారత జట్టు రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది
By తోట వంశీ కుమార్ Published on 4 Jan 2023 1:10 PM ISTవాంఖడే వేదికగా జరిగిన తొలి టీ20లో భారత జట్టు రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 94 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన కష్టాల్లో ఉన్నప్పుడు అక్షర్ పటేల్(31 నాటౌట్ ; 20 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి ఆల్‌రౌండర్ దీపక్ హుడా (41 నాటౌట్ ; 23 బంతుల్లో 1పోర్, 4 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడడంతో ఇండియా పోరాడే స్కోర్‌ను సాధించింది. ఆరో వికెట్‌కు వీరిద్దరు 61 పరుగులు జోడించడంతో లంక ముందు భారత్ 163 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
టీమ్ఇండియా గెలుపులో కీలక పాత్ర పోషించిన దీపక్ హుడాకు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. అయితే.. ఈ ఆటగాడిపై నెటీజన్లు మండిపడుతున్నారు. ఆట బాగానే ఆడినా ఓ దశలో సహనం కోల్పోయి అంపైర్‌ను బండబూతులు తిట్టడమే అందుకు కారణం.
ఏం జరిగిందంటే..?
భారత ఇన్నింగ్స్ 18 ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. కసున్ రజిత ఈ ఓవర్‌ను వేశాడు. ఐదో బంతి ఔట్‌సైడ్ ఆఫ్ దిశగా వేయగా వైడ్‌గా వెళ్లింది. అయితే.. దీపక్ హుడా ఆఫ్ స్టంప్స్ వైపు కదలడంతో అంపైర్ అనంత పద్మనాభన్ వైడ్ ఇవ్వలేదు. దీంతో హుడా అసహనానికి గురైయ్యాడు. అంఫైర్‌ను అసభ్య పదజాలంతో దూషించాడు. తరువాత బంతికి సింగిల్ తీసిన హుడా అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఇదంతా స్టంప్స్ మైక్‌లో ఇదంతా రికార్డు అయ్యింది.
ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. క్రికెట్‌లో తప్పిదాలు సహజం, ఒకవేళ అంపైర్లు తప్పు చేసినా కూడా గౌరవించడం నేర్చుకో. క్రికెట్ మ్యాచ్‌లను కోట్లాది మంది వీక్షిస్తారు అన్న సంగతి గుర్తుంచుకో అంటూ మండిపడుతున్నారు.