ప్రేయసిని పెళ్లాడిన టీమ్ఇండియా క్రికెటర్.. ఫోటోలు వైరల్
Deepak Chahar ties knot with Jaya Bharadwaj.టీమ్ఇండియా క్రికెటర్ దీపక్ చహర్ ఓ ఇంటివాడు అయ్యాడు. తన చిన్ననాటి
By తోట వంశీ కుమార్ Published on 2 Jun 2022 10:03 AM ISTటీమ్ఇండియా క్రికెటర్ దీపక్ చహర్ ఓ ఇంటివాడు అయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రేయసి జయా భరద్వాజ్‌ను పెళ్లిచేసుకున్నాడు. ఆగ్రాలోని జైపీ ప్యాలెస్‌లో బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహా వేడుక జరిగింది. కాగా.. తన పెళ్లి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు దీపక్ చహర్. ఫోటోలతో పాటు ఓ నోట్‌ను రాసుకొచ్చాడు.
'జయా భరద్వాజ్.. నిన్ను తొలిసారి కలిసినప్పుడు నువ్వే నాకు కరెక్ట్ అనే ఫీలింగ్ కలిగింది. ఇప్పటి వరకు మన జీవితంలో జరిగిన ప్రతీ మూమెంట్‌ను ఆనందంగా ఎంజాయ్ చేశాం. పెళ్లితో ఒక్కటైన మనం, ఇకపై అంతే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. నిన్ను ఆనందంగా ఉంచుతానని హామీ ఇస్తున్నా. నా జీవితంలో ఇదే అద్భుతమైన క్షణం. మీ అందరి ఆశీర్వాదాలు మాకు ఇవ్వండి' అంటూ రాసుకొచ్చాడు.
దీపక్ చహర్ భార్య జయా భరద్వాజ్ ఢిల్లీలోని ఎన్‌సీఆర్‌లో కార్పోరేట్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తుంది. వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు క్రికెటర్లు, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇదిలాఉంటే.. ఐపీఎల్ 2022లో దీపక్ చహర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టును 14 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే గాయం కారణంగా దీపక్ చహర్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. ఐపీఎల్ 2021లో సీఎస్కే టైటిల్ సాధనలో దీపక్ చహర్ కీలకపాత్ర పోషించాడు.