ఒక‌ప్పుడు గ్రౌండ్‌లో బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు.. ఇప్పుడు 5 సార్లు గెలిచిన నేత‌కు..

భారత మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆ తర్వాత కామెంటరీ వైపు మొగ్గు చూపాడు.

By Medi Samrat  Published on  4 Jun 2024 12:48 PM GMT
ఒక‌ప్పుడు గ్రౌండ్‌లో బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు.. ఇప్పుడు 5 సార్లు గెలిచిన నేత‌కు..

భారత మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆ తర్వాత కామెంటరీ వైపు మొగ్గు చూపాడు. ఆ త‌ర్వాత‌ రాజకీయాల్లోకి వ‌చ్చాడు. యూసుఫ్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని బహరంపూర్ నుంచి పోటీలో కూడా ఉన్నాడు. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న యూసఫ్ పఠాన్‌.. చరిత్రాత్మక విజయానికి ద‌గ్గ‌ర‌గా ఉన్నాడు. యూసుఫ్‌కు టీఎంసీ(తృణ‌మూల్ కాంగ్రెస్‌) టికెట్ ఇచ్చింది. ప్రస్తుతం ఆయన దాదాపు 84 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

యూసఫ్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి పోటీ చేస్తున్నారు. అధీర్ రంజన్ 1999 నుండి ఈ స్థానం నుండి లోక్‌సభ ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు. ఐదుసార్లు ఎంపీగా గెలిచిన ఆయ‌న‌.. లోక్‌స‌భ‌లో కాంగ్రెస్ ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్నారు. అయితే ఆయ‌న ఇప్పుడు గెలుపు అంత తేలిక కాదు అని తెలుస్తుంది. ఈసారి అధీర్‌ను యూసుఫ్ ఓడించనున్నాడ‌ని నివేదిక‌లు చెబుతున్నాయి. ఇదే జరిగితే యూసుఫ్‌కు ఇది చారిత్రాత్మక విజయం. అలాగే కాంగ్రెస్‌కు పెద్ద ఎదురు దెబ్బ‌. యూసఫ్ గుజరాత్ వాసి కాగా.. పశ్చిమ బెంగాల్ నుంచి టిఎంసి టిక్కెట్‌పై పోటీ చేస్తున్నారు.

2007లో తొలి టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో యూసుఫ్ సభ్యుడు. ఈ టోర్నీ ఫైనల్‌లోనే యూసుఫ్ అరంగేట్రం చేశాడు. 2011లో భారత్ వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో కూడా అత‌డు భాగమయ్యాడు. అయితే యూసుఫ్‌కు బెంగాల్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున సుదీర్ఘకాలం ఆడిన అతను ఈ జట్టును రెండుసార్లు ఛాంపియన్‌గా మార్చడంలో కీల‌క పాత్ర పోషించాడు.

Next Story