ఎంత ప‌ని చేశావు మిచెల్‌.. అభిమాని బీర్ మ‌ట్టిపాలు జేస్తివిగా

Daryl Mitchell six lands in fan`s beer glass.క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్లు బౌండ‌రీలు బాదుతుంటే మైదానంలోని ప్రేక్ష‌కులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Jun 2022 7:26 AM GMT
ఎంత ప‌ని చేశావు మిచెల్‌.. అభిమాని బీర్ మ‌ట్టిపాలు జేస్తివిగా

క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్లు బౌండ‌రీలు బాదుతుంటే మైదానంలోని ప్రేక్ష‌కులు కేరింత‌లు కొడుతూ ఉండ‌టాన్ని మ‌నం చూస్తూనే ఉంటాం. కొన్ని సార్లు బంతులు గ్యాల‌రీలోని అద్దాల‌ను, మ్యాచ్‌ను వీక్షిస్తున్న ప్రేక్ష‌కుల‌కు త‌గులుతుంటాయి. ఇలాంటి సంద‌ర్భాలలో ప‌లువురు గాయ‌ప‌డ్డారు కూడా. తాజాగా ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్ మ‌ధ్య ట్రెంట్ బ్రిడ్జ్ వేదిక‌గా రెండో టెస్ట్ మ్యాచ్‌లో దాదాపుగా ఇలాంటి ఘ‌ట‌న‌నే చోటుచేసుకుంది. అయితే.. ఇక్క‌డ ఓ మ‌హిళా అభిమాని చేతిలోని బీర్ గ్లాస్ ప‌గిలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 56వ ఓవర్ లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ స్పిన్నర్ జాక్ లీచ్ వేసిన బంతిని కివీస్ బ్యాట‌ర్ డారిల్ మిచెల్ లాంగాన్ మీదుగా సిక్స‌ర్ బాదాడు. ఈ బంతి గ్యాలరీలో కూర్చోని మ్యాచ్‌ వీక్షిస్తున్న ఓ మ‌హిళా అభిమాని బీర్‌ గ్లాస్ ను తాకింది. దీంతో ఆ బీర్ గ్లాస్ ప‌గిలిపోయింది. బీర్ మొత్తం నేల‌పాలు అయ్యింది. దీన్ని గ‌మ‌నించిన ఇంగ్లాండ్ ఫీల్డ‌ర్ మాథ్యూ పాట్స్ త‌న సైగ‌ల ద్వారా విష‌యాన్ని స‌హ‌చ‌రుల‌కు తెలియ‌జేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. విష‌యం తెలుసుకున్న కివీస్ జట్టు తొలి రోజు మ్యాచ్ ముగిసిన అనంత‌రం ఆ మ‌హిళా అభిమానికి మ‌రో బీర్ గ్లాస్ అంద‌జేసింది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన న్యూజిలాండ్ జట్టు తొలి రోజు పైచేయి సాధించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 87 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (81 బ్యాటింగ్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), టామ్ బ్లండెల్ (67 బ్యాటింగ్; 8 ఫోర్లు) జట్టును మరోసారి ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు అజేయంగా 149 ప‌రుగులు జోడించారు. ఇంగ్లాండ్ బౌల‌ర్లోల అండ‌ర్స‌న్‌, స్టోక్స్ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. క‌రోనా కార‌ణంగా కివీస్ కెప్టెన్ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు.

Next Story