కామన్వెల్త్ గేమ్స్.. సెమీస్ చేరిన టీమ్ఇండియా
CWG 2022 India Beat Barbados By 100 Runs Qualify For Semi-Finals.కామన్వెల్త్ గేమ్స్‌లో టీమ్ఇండియా మహిళల జట్టు సెమీస్‌కు దూసుకువెళ్లింది.
By తోట వంశీ కుమార్ Published on 4 Aug 2022 8:08 AM ISTకామన్వెల్త్ గేమ్స్‌లో టీమ్ఇండియా మహిళల జట్టు సెమీస్‌కు దూసుకువెళ్లింది. గేమ్స్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అదరగొట్టింది. బర్మింగ్‌హామ్ వేదికగా బార్బడోస్‌ను చిత్తు చిత్తుగా ఓడించి గ్రూప్ ఏ నుంచి సెమీస్‌కు దూసుకువెళ్లింది. భారత బౌలర్ల ధాటికి బార్బడోస్ 62 పరుగులు మాత్రమే చేయగా 100 పరుగుల భారీ తేడాతో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అయితే.. భారత ఇన్నింగ్స్ సాపీగా సాగలేదు. ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ మంధాన(5) ఎల్బీగా పెవిలియన్ చేరింది. మరో ఓపెనర్ షపాలీ వర్మ(43; 26 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్) దూకుడుగా ఆడగా జెమీమా రోడ్రిగ్స్( 56 నాటౌట్; 46 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్) ఆమెకు సహకరించింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యాన్నినెలకొల్పి భారీ స్కోర్‌కు పునాది వేశారు. అయితే.. షపాలీ రనౌట్ కావడంతోక్రీజులోకి వచ్చిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ డకౌట్ కాగా.. తానియా(6) కూడా తక్కువ పరుగులకే ఔటైయ్యారు. రోడిగ్స్‌తో జత కలిసిన దీప్తి శర్మ(34; 28 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్) స్కోర్ బోర్డును ముందుకు తీసుకువెళ్లారు.
అనంతరం లక్ష్య చేధనలో బార్బడోస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 62 పరుగులు మాత్రమే చేసింది. కోషోనా నైట్ 16 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. మిగతావారు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్ నాలుగు వికెట్లు తీయగా, మేఘనా సింగ్, స్నేహ్ రాణా, రాదా యాదవ్, హర్మన్‌ప్రీత్ కౌర్‌లు తలా ఓ వికెట్ పడగొట్టారు. కివీస్, ఇంగ్లాండ్ ల మధ్య జరిగే మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టుతో సెమీస్‌లో టీమ్ఇండియా తలపడనుంది. సెమీఫైనల్‌లో కనుక టీమ్ఇండియా విజయం సాధిస్తే..భారత్‌కు పతకం ఖాయమైనట్లే.