ముంబై, చెన్నై మధ్య బిగ్ ఫైట్.. ఎవరి బలం ఏంటంటే..?
CSK vs MI IPL 2021 Match preview.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)2021 సీజన్‌లో మరో ఆసక్తికర పోరుకు
By తోట వంశీ కుమార్ Published on 1 May 2021 8:18 AM GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)2021 సీజన్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. శనివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన చెన్నై ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించి 10 పాయింట్లతో.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. అన్నే మ్యాచులు ఆడిన ముంబై.. మూడు మ్యాచుల్లో మాత్రమే విజయం సాధించింది. 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి .. అగ్రస్థానాన్ని పదిలం చేసుకోవాలని చెన్నై బావిస్తుండగా.. తమ స్థానాన్ని మెరుగుపరుచుకునేందుకు ముంబై పట్టుదలతో ఉంది. దీంతో ఈ మ్యాచ్ హోరా హోరిగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
గత సీజన్ మిగిల్చిన చేదు అనుభవాల నుంచి చెన్నై పాఠాలు నేర్చుకున్నట్లే కనబడుతోంది. చిన్న తలా సురేష్ రైనా రావడం చెన్నైకి అదనపు బలాన్ని ఇచ్చిందనడంలో సందేహం లేదు. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, ఫాప్ డుప్లెసిస్‌లు మంచి ఫామ్‌లో ఉన్నారు. పవర్ ప్లే లో దంచి కొడుతూ.. చెన్నై జట్టు భారీ స్కోరు సాధించేందుకు బాటలు వేస్తున్నారు. మోయిన్ అలీ, రైనా, జడేజా ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా జడేజా అటు బంతితో పాటు ఇటు బ్యాట్‌తో సంచలన ఇన్నింగ్స్‌లు ఆడుతుండడం చెన్నైకి కలిసొచ్చే అంశం. అవసరం అయితే.. సామ్‌కరణ్, శార్దుల్ ఠాకూర్ లు కూడా బ్యాటింగ్‌లో ఓ చేయి వేయగలరు. అయితే.. కెప్టెన్ ధోనితో పాటు బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు లు ఓ మంచి ఇన్సింగ్స్ బాకీ పడ్డారు. వీళ్లు ఇద్దరు కూడా రాణిస్తే చెన్నైకి తిరుగులేదు అని చెప్పొచ్చు. ఇక బౌలింగ్‌లో శార్ధూల్, ఎంగిడి, జడేజా, మోయిన్ లు ప్రత్యర్థిని కట్టడి చేస్తున్నారు.
చెన్నైకి పూర్తి విరుద్దంగా ఉంది ముంబై ఇండియన్స్. కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కడే నిలకడగా పరుగులు సాధిస్తున్నా.. తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇంత వరకు చేయలేదు. మరో ఓపెనర్ డికాక్ రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫామ్ అందుకోవడం ముంబైకి ఊరట నిచ్చే అంశం. ముంబైలో హార్ట్ హిట్టర్లకు కొదవలేదు. సూర్యకుమార్ యాదవ్ బాగానే ఆడుతున్నా.. భారీ స్కోర్లు చెయ్యట్లేదు. ఇక ఇషాన్ కిషన్ ఈ మ్యాచుకు దూరం అయ్యే అవకాశాలున్నాయి. హార్దిక్ పాండ్యా మెరుపులు ఒకటి రెండు ఓవర్లకే పరిమితమవుతున్నాయి. కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యాలు ఫినిషర్ రోల్‌ని పోషించాల్సి ఉంది. వీరిలో ఏ ఇద్దరూ నిలిచినా.. చెన్నై ముందు భారీ లక్ష్యాన్ని ఉంచడం ఖాయం.
బ్యాటింగ్‌లో ఆందోళనలు ఉన్నా బౌలింగ్ విభాగంలో ముంబైకి తిరుగులేదు. స్టార్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ వికెట్లు పడగొట్టకపోయినా.. పరుగులు కట్టడిచేస్తున్నారు. పవర్ ప్లేతో పాటు డెత్ ఓవర్లలోనూ ఈ జోడీ మెరిస్తేనే ముంబైకి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మిడిల్ ఓవర్లలో స్పిన్నర్ రాహుల్ చహర్ వికెట్లు పడగొడుతుండడం కలిసొచ్చే అంశం. వీరితో పాటు నాథన్ కౌల్టర్ నైల్, స్నిన్నర్ జయంత్ యాదవ్ లు రాణిస్తే ముంబైకి తిరుగులేదు.