క్రిస్టియానో రొనాల్డో ఇంట తీవ్ర విషాదం.. కుమారుడు మృతి
Cristiano Ronaldo announces death of his baby boy.ప్రముఖ పుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఇంట తీవ్ర విషాదం
By తోట వంశీ కుమార్ Published on 19 April 2022 8:07 AM IST
ప్రముఖ పుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రొనాల్డో భార్య జార్జినా రోడ్రిగ్జ్ కవల పిల్లలకు జన్మనివ్వగా వారిలో ఒకరు మృతి చెందారు. ఈ విషయాన్ని రొనాల్డో సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. 'ఇది చాలా బాధాకరమైన విషయం. అప్పుడే జన్మించిన మా బాబు మరణించాడు. ఏ తల్లిదండ్రులకైనా ఇది జీర్ణించుకోలేని విషాదం. మా పాప బతికి ఉండడం కొంతలో కొంత సంతోషించే విషయం. ఈ కష్టసమయంలో మా వెన్నంటే ఉన్న వైద్యులు, నర్సులకు కృతజ్ఞతలు. ఇలాంటి సమయంలో వ్యక్తిగత గోపత్యకు భంగం కల్పించవద్దని కోరుకుంటున్నాం' అని రొనాల్డొ, జార్జినా రోడ్రిగ్జ్ వారి వారి సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.
— Cristiano Ronaldo (@Cristiano) April 18, 2022
ఇదిలా ఉంటే.. క్రిస్టియానో రొనాల్డో-జార్జినా రోడ్రిగ్జ్ దంపతులకు ఇప్పటికే నలుగురు పిల్లలున్నారు. ఈ జంట మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నట్లు, కవలలు జన్మించే అవకాశం ఉందని గతేడాది అక్టోబర్‌లో తెలిపారు. కాగా.. కవలల్లో అబ్బాయి మరణించగా, అమ్మాయి జీవించి ఉంది. ఈ విషయం తెలిసిన అభిమానులు, ఆటగాళ్లు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా రొనాల్డొను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ మాంచెస్టర్ యునైటెడ్ స్ట్రైకర్ ఏ మాత్రం ఖాళీ దొరికినా కుటుంబంతో గడిపేందుకు చాలా ఇష్టపడుతుంటాడు అన్న సంగతి తెలిసిందే.
ఇక ఆట విషయానికి వస్తే.. అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్‌లో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా రోనాల్డో నిలిచాడు. పోర్చుగల్ కెప్టెన్ అయిన రోనాల్డ్ ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ సాధించడంతో ఈ రికార్డు అందుకున్నాడు. రోనాల్డ్ ఖాతాలో ఇప్పుడు 111 అంతర్జాతీయ గోల్స్ ఉన్నాయి.