IPL-2024: చరిత్ర సృష్టించిన రాజస్థాన్ బౌలర్ చాహల్
రాజస్థాన్ రాయల్స్ ఈ ఐపీఎల్ సీజన్‌లో అద్భుతంగా రాణించింది.
By Srikanth Gundamalla Published on 8 May 2024 2:10 AM GMTIPL-2024: చరిత్ర సృష్టించిన రాజస్థాన్ బౌలర్ చాహల్
రాజస్థాన్ రాయల్స్ ఈ ఐపీఎల్ సీజన్‌లో అద్భుతంగా రాణించింది. మొదట్నుంచి ఈ టీమ్ పాయింట్స్ టేబుల్‌లో తొలి స్థానంలో ఉంది. కానీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమితో రెండో స్థానానికి పడిపోయింది. కాగా.. మంగళవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్ సందర్భంగా యుజ్వేంద్ర చాహల్ చరిత్ర సృష్టించాడు.
రాజస్థాన్ రాయల్స్ మణికట్టు స్పిన్నర్ చాహల్ చరిత్రను సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో 350 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో చాహల్ ఈ ఘనతను చేరుకున్నాడు. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్‌ను ఔట్ ఏసి టీ20 క్రికెట్‌లో 350 వికెట్ల మైలు రాయిని చేరుకున్నాడు. 301 మ్యాచ్‌లు ఆడిన యుజ్వేంద్ర చాహల్ ఇప్పటి వరకు 350 వికెట్లు తీశాడు. ఇక 310 వికెట్లు తీసిన ముంబై ఇండియన్స్ బౌలర్ పీయూష్ చావ్లా చాహల్ తర్వాతి స్థానంలో ఉన్నాడు.
ప్రపంచ వ్యాప్తంగా టీ20 క్రికెట్ బౌలర్ల జాబితాను చూస్తే.. 350 వికెట్లు అందుకున్న 11వ బౌలర్‌గా యుజ్వేంద్ర చాహల్ ఉన్నాడు. ఈ జాబితాలో తొలి స్థానంలో వెస్టిండీస్ మాజీ క్రికెటర్ డ్వేన్ బ్రావో ఉన్నాడు. బ్రావో 574 మ్యాచ్‌లు ఆడి 625 వికెట్లు తీసుకున్నాడు. ఇక ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా రషీద్ ఖాన్, సునీల్ నరైన్, ఇమ్రాన్ తాహీర్, షకీబ్ అల్ హసన్, ఆండ్రీ రస్సెల్, వహాబ్ రియాజ్, లసిత్ మలింగ, సోహైల్ తన్వీర్, క్రిస్ జోర్డాన్ నిలిచాడు.
ఇక చాహల్ భారత్ తరఫున ఆడిన టీ20 మ్యాచుల్లో 96 వికెట్లను పడగొట్టాడు. తన ఐపీఎల్ కెరియర్‌లో మాత్రం ఏకంగా 201 వికెట్లను సాధించాడు. లెగ్ స్పిన్‌తో బ్యాటర్లను కన్ఫ్యూజ్ చేస్తూ.. ముప్పుతిప్పలు పెడుతుంటాడు చాహల్. టీ20 మ్యాచుల్లో ఐపీఎల్‌లోనే కాదు.. భారత్‌కు కూడా ఇతను కీలక ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. త్వరలోనే జరగబోయే టీ20 వరల్డ్ కప్ భారత్ జట్టులో కూడా యుజ్వేంద్ర చాహల్ చోటు దక్కించుకున్నాడు.