24 ఏళ్ల త‌రువాత‌.. కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్.. ఒకే గ్రూప్‌లో భారత్-పాక్

Cricket in Commonwealth Games after 24 years.క్రికెట్ అభిమానుల‌కు ఇది శుభ‌వార్తే. 24 ఏళ్ల త‌రువాత కామ‌న్‌వెల్త్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Feb 2022 2:59 AM GMT
24 ఏళ్ల త‌రువాత‌.. కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్.. ఒకే గ్రూప్‌లో భారత్-పాక్

క్రికెట్ అభిమానుల‌కు ఇది శుభ‌వార్తే. 24 ఏళ్ల త‌రువాత కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో క్రికెట్‌కు మ‌రోసారి చోటు ద‌క్కింది. ఈ ఏడాది ఇంగ్లాండ్‌లోని బర్మింగ్ హోమ్ వేదిక‌గా జర‌గ‌నున్న 22వ ఎడిష‌న్‌లో క్రికెట్‌కు కూడా చోటు క‌ల్పించిన‌ట్లు అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌(ఐసీసీ) ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. 1998లో కౌలాలంపూర్ వేదిక‌గా జ‌రిగిన కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో తొలిసారి స్థానం క‌ల్పించారు. కాగా.. ఈసారి మాత్రం మహిళల క్రికెట్ కు మాత్రమే చోటు దక్కింద‌ని కామన్‌వెల్త్‌ క్రీడల సమాఖ్య(సీజీఎఫ్‌) పేర్కొంది.

టీ20 ఫార్మాట్‌లో లీగ్ క‌మ్ నాకౌట్ ప‌ద్ద‌తితో మ్యాచ్‌లు జ‌ర‌గనున్నాయి. మొత్తం 8 జ‌ట్లు ఈ టోర్నిలో పాల్గొన‌నున్నాయి. ఇప్ప‌టికే ఆస్ట్రేలియా, భార‌త్‌, బార్చ‌డోస్‌, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా, పాకిస్థాన్ జ‌ట్లు ఈ టోర్నికి అర్హ‌త సాధించ‌గా.. తాజాగా శ్రీలంక కూడా క్వాలిపై అయిన‌ట్లు ఐసీసీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. బంగారు ప‌త‌కం కోసం ఎనిమిది జ‌ట్లు హోరా హోరిగా పోటి ప‌డ‌నున్నాయి.

8 జ‌ట్ల‌ను రెండు గ్రూప్‌లుగా విభ‌జించారు. ఓకే గ్రూప్‌లో భార‌త్‌, పాకిస్థాన్‌లు త‌ల‌ప‌డ‌నున్నాయి. గ్రూప్ ఏలో ఆస్ట్రేలియా, భారత్‌, బార్బడోస్, పాకిస్తాన్ ఉండగా.. గ్రూప్ బిలో ఇంగ్గాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా శ్రీలంక జట్లు ఉన్నాయి. జూలై 29 న భారత్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రిగే మ్యాచ్‌తో కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ పోటీలు ప్రారంభం అవుతాయి.

1998లో కౌలాలంపూర్ వేదికగా జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో పురుషుల జ‌ట్లు పాల్గొన్నాయి. వ‌న్డే ఫార్మాట్‌లో ఆ టోర్ని జ‌రిగింది. షాన్ పొలాక్ నేతృత్వంలోని ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు స్టీవ్ వా సార‌ధ్యంలోని ఆస్ట్రేలియా జ‌ట్టును ఓడించి బంగారు ప‌త‌కాన్ని సొంతం చేసుకుంది. టీమ్ఇండియా ఒకే మ్యాచ్‌లో విజ‌యం సాధించి గ్రూప్ స్టేజీకే ప‌రిమితమైంది.

Next Story
Share it