పృథ్వీ షా సరైన మార్గంలో ఉన్నాడు.. చీఫ్ సెలెక్టర్ పొగ‌డ్త‌లు

పృథ్వీ షా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై చాలా కాలం అయింది. అతడు నాలుగేళ్లుగా ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడలేదు.

By Medi Samrat
Published on : 28 Aug 2025 2:25 PM IST

పృథ్వీ షా సరైన మార్గంలో ఉన్నాడు.. చీఫ్ సెలెక్టర్ పొగ‌డ్త‌లు

పృథ్వీ షా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై చాలా కాలం అయింది. అతడు నాలుగేళ్లుగా ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడలేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుతమైన ఆరంభం తర్వాత షా ను న‌యా సచిన్ టెండూల్కర్ అని పిలిచారు. అయితే ఫిట్‌నెస్ సరిగా లేకపోవడం, ప్రాక్టీస్ లేకపోవడంతో షా ఆటతీరు తగ్గింది. దీంతో అతడు IPL 2025లో కూడా అమ్ముడుపోలేదు.

పృథ్వీ షా కొంతకాలం క్రితం ముంబై జట్టును వదిలి మహారాష్ట్ర జ‌ట్టులో చేరాడు. బుచ్చిబాబు టోర్నమెంట్ 2025లో అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. షా తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. అటువంటి పరిస్థితిలో మహారాష్ట్ర చీఫ్ సెలెక్టర్ అక్షయ్ దారేకర్ షాను చాలా ప్రశంసించారు. పృథ్వీ ఇప్పుడు సరైన దారిలో ఉన్నాడని అక్షయ్ చెప్పాడు. షా బ్యాటింగ్‌పై అతనికి ఎప్పుడూ సందేహం లేదు. ప్రస్తుతం ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాడ‌ని పేర్కొన్నాడు.

మిడ్-డేతో అక్షయ్ దారేకర్ మాట్లాడుతూ, "పృథ్వీ సరైన మార్గంలో ఉన్నాడు. అతని బ్యాటింగ్‌లో ఎప్పుడూ ఎటువంటి సమస్య లేదు. అతను తన బ్యాటింగ్‌తో అద్భుతాలు చేయడానికి ఏకాగ్రతతో ఉన్నాడు. అతడు తన ఫిట్‌నెస్‌కు పూర్తిగా కట్టుబడి ఉన్నాడు.. ప్రతిరోజూ ప్రాక్టీస్ చేస్తున్నాడు. పృథ్వీ భారీగా పరుగులు చేయాలని తహతహలాడుతున్నాడని దారేకర్ చెప్పాడు. పృథ్వీ బుచ్చి బాబు ట్రోఫీ 2025 నాలుగు మ్యాచ్‌లలో 1 సెంచరీ, 1 ఫిఫ్టీని సాధించాడు.

పృథ్వీ ఎప్పుడూ దూకుడుగా ఆడటం, ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం చెలాయించడం మన‌కు తెలుసు. బుచ్చిబాబు టోర్నమెంట్‌లో మహారాష్ట్ర తరపున తన మొదటి రెండు మ్యాచ్‌లలో అతను ఈ శైలిలో బ్యాటింగ్ చేశాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అతని క్లాస్ స్పష్టంగా కనిపించింది. భారీగా పరుగులు చేయాలని తహతహలాడుతున్నాడు. మహారాష్ట్రను రంజీ నాకౌట్‌కు తీసుకెళ్లడమే అతని లక్ష్యం. పృథ్వీ ఎంత మెరుగ్గా రాణిస్తే.. అతనికి, జట్టుకు అంత మంచిది. ఈ సీజన్ తనకు చాలా ముఖ్యమైనదని పృథ్వీ గ్రహించాడు. దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్నాడని పేర్కొన్నాడు.

పృథ్వీ షా భారత్ తరఫున 5 టెస్టులు, 6 వన్డేలు, 1 టీ20 మ్యాచ్ ఆడాడు. టెస్టులో 9 ఇన్నింగ్స్‌లలో 42.37 సగటు, 86.04 స్ట్రైక్ రేట్‌తో 339 పరుగులు చేశాడు. వన్డేల్లో 6 ఇన్నింగ్స్‌ల్లో 189 పరుగులు చేశాడు. ఒక్క టీ20 ఇంటర్నేషనల్‌లో కూడా షా ఖాతా తెరవలేదు.

Next Story