'చిన్నస్వామి స్టేడియంలో 11 సీట్లు శాశ్వతంగా ఖాళీగా ఉంటాయి'.. తొక్కిసలాట మృతులకు ఘన నివాళి
2025 జూన్ 4న ఆర్‌సీబీ తన మొదటి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుని సంబరాలు చేసుకుంటున్నప్పుడు ఆ విజయోత్సవాల మధ్యలో జరిగిన తొక్కిసలాట వల్ల 11 కుటుంబాలు శోకంలో మునిగిపోతాయని ఎవరు ఊహించారు.?
By - Medi Samrat |
2025 జూన్ 4న ఆర్‌సీబీ తన మొదటి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుని సంబరాలు చేసుకుంటున్నప్పుడు ఆ విజయోత్సవాల మధ్యలో జరిగిన తొక్కిసలాట వల్ల 11 కుటుంబాలు శోకంలో మునిగిపోతాయని ఎవరు ఊహించారు.? చిన్నస్వామి స్టేడియం, అసెంబ్లీ చుట్టూ గుమిగూడిన లక్షలాది మంది జనం సహనం కోల్పోయినప్పుడు, అక్కడి పరిపాలన విభాగం, నిర్వాహకుల నిర్లక్ష్యం స్పష్టంగా వెలుగులోకి వచ్చింది.
18 ఏళ్లలో ఆర్‌సిబి తొలి ఐపిఎల్ ట్రోఫీని గెలుచుకున్న సందర్భంగా సంబరాలు చేసుకునేందుకు లక్షలాది మంది ప్రజలు స్టేడియానికి పోటెత్తారు, కానీ అక్కడ జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. ఇప్పుడు, ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి ముందు.. ఈ ఘటనను స్మరించుకోవడానికి ఆర్‌సిబి, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కెఎస్‌సిఎ) ఒక భావోద్వేగ నిర్ణయం తీసుకున్నాయి.
చిన్నస్వామి స్టేడియంలో ఒక స్మారక ఫలకాన్ని ఏర్పాటు చేసి 11 సీట్లను ఎల్లప్పుడూ ఖాళీగా ఉంచాలని ఆర్‌సిబి-కెఎస్‌సిఎ నిర్ణయించింది. ఈ సీట్లు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 11 మందికి ప్రతీకగా నిలుస్తాయి. ఈ స్మారక ఫలకాన్ని స్టేడియం ప్రవేశ ద్వారం సమీపంలో ఉంచుతారు, తద్వారా ఆ ప్రదేశం శాశ్వత గౌరవ చిహ్నంగా నిలిచి ఉంటుంది. ఇంతే కాకుండా, ఐపీఎల్ మ్యాచ్‌కు ముందు బాధితుల పేర్లను స్క్రీన్‌పై ప్రదర్శించడంతో పాటు, ఒక నిమిషం పాటు మౌనం పాటిస్తారు, ఇందులో ఇరు జట్లు పాల్గొంటాయి.
ఆర్‌సీబీ విజయం తర్వాత జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో జస్టిస్ జాన్ మైఖేల్ డి'కున్హా కమిటీ ఆ స్టేడియం భారీ స్థాయి కార్యక్రమాలకు సురక్షితం కాదని ప్రకటించి, అక్కడ మ్యాచ్‌లు నిర్వహించడాన్ని నిషేధించింది. తత్ఫలితంగా, ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 మ్యాచ్‌లను బెంగళూరు నుండి నవీ ముంబైకి తరలించారు. ఆ తర్వాత దేశీయ టీ20 లీగ్ అయిన మహారాజా టీ20 ట్రోఫీని బెంగళూరు నుంచి మైసూరుకు తరలించాల్సి వచ్చింది. అయితే, ఇప్పుడు అక్కడ మ్యాచ్‌లు నిర్వహించడానికి ఆమోదం లభించింది.
ఆ విషాద సంఘటన గురించి ఆలోచించడం బాధాకరం, కానీ మేము కొంతకాలంగా యాజమాన్య కమిటీ, ఇతర ముఖ్య భాగస్వాములతో ఈ స్మారక చిహ్నం గురించి చర్చిస్తున్నాము. ఆ 11 మంది జ్ఞాపకార్థం వారిని గౌరవించడం ముఖ్యమని మేమందరం కలిసి భావించాము. మేము ఎవరి బాధనూ మళ్లీ రేకెత్తించాలనుకోవడం లేదు, కేవలం వారిని స్మరించుకోవాలనుకుంటున్నాము. అందుకే, విషాదకరంగా ప్రాణాలు కోల్పోయిన ఆ క్రికెట్ అభిమానుల జ్ఞాపకార్థం ఒక ఫలకాన్ని ఏర్పాటు చేయాలని మేము నిర్ణయించుకున్నామని కేఎస్‌సీఏ అధ్యక్షుడు వెంకటేష్ ప్రసాద్ తెలిపారు.