సెంటిమెంట్‌ను బ్రేక్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్

చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి విజేతగా నిలిచి ముంబయి సరసన నిలిచింది. టాస్ గెలిచిన చెన్నై గుజరాత్ కు బ్యాటింగ్ అప్పగించింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 May 2023 4:47 AM GMT
Chennai Super Kings, IPL 2023, Ravindra Jadeja , MS Dhoni

సెంటిమెంట్‌ను బ్రేక్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 

చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి విజేతగా నిలిచి ముంబయి సరసన నిలిచింది. టాస్ గెలిచిన చెన్నై గుజరాత్ కు బ్యాటింగ్ అప్పగించింది. గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 214/4 పరుగుల భారీ స్కోరు చేసింది. సాయి సుదర్శన్ 47 బంతుల్లో 96 రన్స్ కొట్టాడు. చెన్నై ఛేదన ప్రారంభిస్తుందనేసరికి వర్షం స్టార్ట్ అయింది. కాసేపటి తర్వాత ఆగినప్పటికీ మ్యాచ్ అర్ధరాత్రి 12:10 తర్వాత మొదలైంది. వర్షం వల్ల డక్ వర్త్ లూయిస్ ప్రకారం రెండో ఇన్నింగ్స్ ని 15 ఓవర్లకి కుదించి టార్గెట్ ని 171 ఉంచారు. చెన్నై బ్యాటర్లు ఆఖరి బంతికి విజయాన్ని అందించారు. ఇక ఓ సెంటిమెంట్ ను చెన్నై బ్రేక్ చేసింది. ఐపీఎల్ ఫైనల్లో అది కూడా బేసి సంఖ్య ఉన్న సంవత్సరాల్లో 2009, 2011, 2013, 2015, 2017, 2019, 2021 సంవత్సరాల్లో ఛేజింగ్ చేసిన ఏ జట్టు కూడా గెలవలేదు. ఇప్పుడు ఆ సెంటిమెంట్ని చెన్నై సూపర్ కింగ్స్ బ్రేక్ చేసింది.

ఐపీఎల్ ఫైనల్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 214 పరుగులు చేసింది. 33 బంతుల్లోనే 50 చేసిన సాయి సుదర్శన్ సెంచరీకి 4 పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు. 21 ఏళ్ల సాయిసుదర్శన్ మొత్తం 47 బంతులాడి 96 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 8 ఫోర్లు, 6 సిక్సులున్నాయి. సాహా 54, గిల్ 39 పరుగులు చేసి అవుటయ్యారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 21 పరుగులతో అజేయంగా నిలిచాడు. సీఎస్కే బౌలర్లలో పతిరణ 2, దీపక్ చహర్ 1, జడేజా 1 వికెట్ తీశారు. లక్ష్యఛేదనలో 0.3 ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ 4 పరుగులు చేసిన అనంతరం వర్షం రావడంతో మ్యాచ్ నిలిచింది. వర్షం తగ్గిన అనంతరం చెన్నై జట్టు లక్ష్యాన్ని 15 ఓవర్లలో 171 పరుగులకు కుదించారు. లక్ష్యఛేదనలో చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే తొలి వికెట్ కు 6.3 ఓవర్లలోనే 74 పరుగులు జోడించారు. గైక్వాడ్ 26, కాన్వే 47 పరుగులు సాధించారు. వన్ డౌన్ లో వచ్చిన శివమ్ దూబే 32 పరుగులు చేశాడు. రహానే 27 పరుగులు చేయగా... అంబటి రాయుడు 8 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులతో 19 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో చెన్నై చివరి రెండు బంతుల్లో 10 పరుగులు అవసరం కాగా జడేజా సిక్సర్, ఫోర్ కొట్టి చెన్నైకు విజయాన్ని అందించాడు.

Next Story